తిరుమలాయపాలెం, నవంబర్ 14: రైతుల సమస్యలపై ఆందోళన చేసిన నాయకులపై కేసులెలా పెడతారంటూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేసుల నమోదు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, తుపాను వల్ల తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గురువారం ఆందోళన నిర్వహించిన తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు ఎం.రాజేంద్రప్రసాద్, గొర్రెపాటి రమేశ్, వీరస్వామి, అచ్చా ఉప్పలయ్య, వెంకటేశ్వర్లు, నగన్న, షబ్బీర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.