ఇల్లెందు, నవంబర్ 12: ఇల్లెందు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) నూడెమోక్రసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చేపట్టిన గ్రామీణ ప్రాంతాల బంద్ విజయవంతమైంది. కొమరారం, మర్రిగూడెం, పోలారం, పోచారం, బోయితండా, మాణిక్యరం పంచాయతీల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ నాయకులు మోతీలాల్, మంగ్యా మాట్లాడుతూ.. మండలవ్యాప్తంగా మొక్కజొన్న ఎక్కువగా పండిస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చేతికొచ్చిన పంటలు వరుస వర్షాలతో దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, రైతుల సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుంటే.. ఎమ్మెల్యే కోరం కనకయ్య తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల మొక్కజొన్న రైతులు పాల్గొన్నారు.