కూసుమంచి (నేలకొండపల్లి), ఏప్రిల్ 17: రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూ భారతి అని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో భూ భారతి చట్టం అవగాహన సదస్సును అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రత్యేకించి రైతుల భూములపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూ సమస్యలపై రైతులు మీసేవలో దరఖాస్తు చేసుకుంటే నిర్దేశించిన సమయంలో పరిష్కరిస్తామన్నారు. భూ భారతి పోర్టల్లో నమోదైన రికార్డు ఆధారంగానే బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నారు.
అనంతరం రైతుల సందేహాలను ఆమె అక్కడికక్కడే నివృత్తి చేశారు. ఈ చట్టం ద్వారా భూములకు సంబంధించి అవినీతిని అరికట్టి రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లడానికి పైలట్ స్టడీ కోసం నాలుగు మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. అందులో జిల్లా నుంచి నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేశారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో నేలకొండపల్లి ఏఎంసీ చైర్మన్ వీ సీతారాములు, డీఏవో ధనసరి పుల్లయ్య, ఆర్డీవో నర్సింహారావు, ఏడీఏ బీ సరిత, తహసీల్దార్లు హుస్సేన్, వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎర్రయ్య, వ్యవసా య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.