ఖమ్మం అర్బన్, మే 4: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి నీట్-2025 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలోని ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,739 మంది విద్యార్థులకు గాను 68 మంది గైర్హాజరై 2,671 మంది పరీక్ష రాశారు. కేంద్రాల్లోకి 11 గంటల నుంచే అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించినప్పటికీ గేట్స్ మూసివేసే సమయం మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యార్థులు వస్తూనే ఉన్నారు. చివరి నిమిషం వరకూ రావడం కనిపించింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
కూసుమంచి మండలానికి చెందిన విద్యార్థిని ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ పరీక్ష కేంద్రానికి నాలుగు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. అధికారులను రిక్వెస్ట్ చేసినప్పటికీ నిబంధనల ప్రకారం అనుమతించలేమని చెప్పడంతో ఏడ్చుకుంటూ వెనుతిరిగింది. మధ్యాహ్నం 1:25 గంటలకు ఎస్ఆర్బీజీఎన్ఆర్ పరీక్ష కేంద్రంలోకి వెళ్లింది. ఆమె పరీక్ష కేంద్రం అదికాదని, పక్కనే ఉన్న పీజీ కళాశాల అని అధికారులు గుర్తించారు. సమయం ముగుస్తుండడంతో అక్కడ ఉన్న వ్యక్తుల బైక్ మీద పోలీసులు పీజీ కళాశాల కేంద్రానికి పంపించారు.
పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు. మెటల్ డిటెక్టర్లతో నిశితంగా చేశారు. విద్యార్థినుల చెవుల దిద్దులు, కాళ్ల పట్టీలు, షూస్, సాక్సుల వంటి వాటిని తీసిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు.
నీట్ పరీక్షను తల్లీ, కూతురు రాశారు. కూతురు కావేరి ఖమ్మంలో ఎన్ఎస్సీ స్కూల్ కేంద్రంలో, తల్లి సరిత సూర్యాపేట జూనియర్ కళాశాల కేంద్రంలో పరీక్ష రాశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచనాయక్తండా వీరి స్వగ్రామం. 2007లో బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన సరిత స్వగ్రామంలోనే ఆర్ఎంపీగా చేస్తున్నారు.
కొత్తగూడెం గణేశ్ టెంపుల్, మే 4: నీట్ ప్రవేశ పరీక్ష కోసం భద్రాద్రి జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలను కేటాయించారు. మొత్తం 1,115 మంది విద్యార్థులకు గాను 1,058 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 57 మంది గైర్హాజరయ్యారు.