ఖమ్మం, మే 17 : ఖమ్మం కార్పొరేషన్లో జరుగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్పొరేటర్లు సన్నద్ధం కావాలని మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ ప్రగతి సమీక్షలో వారు మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వాటిలో హరితహారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రాబోయే వానకాలన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలన్నారు. పిచ్చిమొక్కలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి డివిజన్లో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సమవేశంలో టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ కర్నాటి కృష్ణ, పలువురు కార్పొరేటర్లు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మంలో అభివృద్ధి పనులు ఆగవు
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిరంతరం జరుగుతూనే ఉంటాయని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. నగరంలోని 56, 4వ డివిజన్లలో మంగళవారం ఆమె పర్యటించారు. స్థానికుల వద్దకు వెళ్లి మంచినీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. సమయానికి నీటిని విడుదల చేస్తున్నారా లేదా, పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజు వీధులను శభ్రం చేస్తున్నారా వంటి విషయాలను తెలుసుకున్నారు. 56వ డివిజన్లో లీకేజీ సమస్యలు ఉన్నాయని స్థాకులు మేయర్‌కు చెప్పడంతో.. 24గంటల్లో సమస్య పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, 56వ డివిజన్ కార్పొరేటర్ పైడిపల్లి రోహిణీసత్యనారాయణ, 4వ డివిజన్ కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, ఈఈ కృష్ణలాల్, ఈఈ రంజిత్, డీఈ రంగారావు, ఏఈ కుమార్ పాల్గొన్నారు.
నిబంధనలుంటేనే వెంచర్లకు అనుమతులు
ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న వెంచర్లకు వెంటనే అనుమతులు జారీ చేస్తామని, నిబంధనలను ధిక్కరించి వెంచర్లు ఏర్పాటు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సుడా పరిధిలో ఉన్న రఘునాథపాలెం మండలం మంచుకొండ, ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన వెంచర్లను మంగళవారం ఆయన పరిశీలించారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారా లేదా, మార్టిగైజ్ చేశారా లేదా, రోడ్లు నిర్మాణం చేపట్టారా లేదా తదితర విషయాలను సిబ్బందితో కలిసి కొలతలు వేయించి రికార్డు చేశారు. అన్నిరకాల నిబంధలను పాటించిన వాటికి వెంటనే అనుమతులు ఇస్తానని ఆయా వెంచర్ల యజమానులకు కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్‌తోపాటు సుడా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.