కూసుమంచి, జూన్ 19 : క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరు ఎన్సీసీ అని, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ, ఏపీ డీడీజీ డైరెక్టర్ ఎయిర్ కమోడోర్ ఎంవీ.రెడ్డి అన్నారు. పాలేరులోని నవోదయ విద్యాలయలో తెలంగాణలోని ఐదు జిల్లాలకు చెందిన 560 మంది ఎన్సీసీ క్యాడెట్లకు 10 రోజులపాటు నిర్వహించే 11(టీ)బీఎన్ సీఏసీటీ-IV ఎన్సీసీ క్యాంపు బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంవీ రెడ్డి మాట్లాడుతూ పది రోజులపాటు ఎన్సీసీ క్యాడెట్లకు ఫైరింగ్, వికాసం, డ్రిల్, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, సాంస్కృతిక అంశాల్లో నిర్వహించే కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ నెల 28 వరకు జరిగే శిక్షణలో ఎన్సీసీ ప్రాధాన్యతలను కూడా వివరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కల్నల్ సచిన్ నింబాల్కర్, వీఆర్సీ, జీపీ సీడీఆర్ ఏసీసీ వరంగల్, ఏడీ సికింద్రాబాద్ కల్నల్ సంజైగుప్తా, కల్నల్ సంజీవద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.