కారేపల్లి, డిసెంబర్ 22 : జాతీయ గణిత దినోత్సవాన్ని సింగరేణి (కారేపల్లి) మండలంలోని అన్ని విద్యా సంస్థలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిట్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గణితం బోధించే ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ‘బ్యాచ్లర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చి’ అవార్డును అందుకున్న గొప్ప వ్యక్తి, భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అని కొనియాడారు. శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర గొప్పతనాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, గణిత, ఇతర బోధన సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Karepally : కారేపల్లిలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం