పినపాక, జనవరి 7: పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 69వ జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో, కంది ఛారిటబుల్ ట్రస్ట్, మౌరి టెక్ సౌజన్యంతో నిర్వహిస్తున్న పోటీలకు దేశవ్యాప్తంగా 33 జట్లు హాజరయ్యాయి. పోటీలను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, బెలూన్లను గాలిలోకి వదిలి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, ఓడిపోయిన క్రీడాకారులు తమ తప్పులను సరిదిద్దుకొని మళ్లీ గెలిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. ప్రతీ క్రీడాకారుడు తమలోని క్రీడా ప్రతిభను పోటీల ద్వారా ప్రదర్శించాలన్నారు. ఇంతటి మారుమూల ప్రాంతంలో క్రీడా పోటీలను చూస్తుంటే.. ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్లు ఉందన్నారు. పోటీల నిర్వహణ బాధ్యతను తీసుకున్న కంది ఛారిబటుల్ ట్రస్ట్, మౌరి టెక్ సంస్థలను మంత్రులు అభినందించారు.
మొదట మధ్యప్రదేశ్-చండీగఢ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన కబడ్డీ మ్యాచ్ను మంత్రులు, అధికారులు వీక్షించి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, డీఈవో నాగలక్ష్మి, డీవైఎస్వో పరంధామరెడ్డి, టోర్నమెంట్ అబ్జర్వర్ నిర్మల్ జంగ్డే, సర్పంచ్ వాగబోయిన చందర్రావు, కంది ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సుబ్బారెడ్డి, విశ్వభరత్రెడ్డి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో సంకీర్త్, ఎంపీవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.