నల్లగొండ, ఫిబ్రవరి 13: వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. చివరికి 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 11న ఎన్నికల యంత్రాంగం చేపట్టిన స్క్రూట్నీలో తండు ఉపేందర్ అనే అభ్యర్థి తన నామినేషన్ పత్రంపై సంతకం పెట్టకపోవడంతో స్క్రూట్నీలో ఎగిరిపోగా.. గురువారం కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండ నాగరాజులు ఉపసంహరించుకున్న నేపథ్యంలో చివరికి 19 మంది బరిలో ఉన్నట్లు కలెక్టర్, ఆర్వో ఇలా త్రిపాఠి ప్రకటించారు.
ఈ నెల 3వ తేదీన ఎస్ఈసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా.. నాటి నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. స్క్రూట్నీ, ఉపసంహరణ అనంతరం 19 మంది బరిలో ఉన్నారు. బరిలో ఉన్న వారిలో పులి సరోత్తమ్‌రెడ్డి(బీజేపీ), లింగిడి వెంకటేశ్వర్లు(ప్రజావాణి పార్టీ), అర్వ స్వాతి(స్వతంత్ర), అలుగుబెల్లి నర్సిరెడ్డి(స్వతంత్ర), కంటె సాయన్న(స్వతంత్ర), డాక్టర్ కొలిపాక వెంకటస్వామి(స్వతంత్ర), గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి (స్వతంత్ర), పన్నాల గోపాల్‌రెడ్డి(స్వతంత్ర), ఏలె చంద్రమోహన్(స్వతంత్ర), చాలిక చంద్రశేఖర్(స్వతంత్ర), జంగిటి కైలాసం(స్వతంత్ర), జెట్టి శంకర్(స్వతంత్ర), తలకోల పురుషోత్తంరెడ్డి(స్వతంత్ర), తాటికొండ వెంకటరాజయ్య(స్వతంత్ర), దామెర బాబురావు(స్వతంత్ర), పింగిలి శ్రీపాల్‌రెడ్డి(స్వతంత్ర), పూల రవీందర్(స్వతంత్ర), బంక రాజు(స్వతంత్ర), ఎస్.సుందర్రాజు(స్వతంత్ర)లు బరిలో ఉన్నారు.
అయితే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నది. అయితే కొత్తగా ఏర్పడిన 12 జిల్లాల్లో మొత్తం ఓటర్లు 25,797 మంది ఉండగా.. సిద్దిపేటలో 166 మంది, జనగామ 1,002, హనుమకొండ 5,215, వరంగల్ 2,352, మహబూబాబాద్ 1,663, భూపాలపల్లి 329, ములుగు 628, భద్రాద్రి కొత్తగూడెం 2,022, ఖమ్మం 4,089, యాదాద్రి భువనగిరి 984, సూర్యాపేటలో 2,664 మంది ఓటర్లు ఉండగా.. నల్లగొండలో 4,683 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 15,783 మంది ఉండగా.. స్త్రీలు 10,314 మంది ఉన్నారు. వీరు ఓటు హక్కును వినియోగించుకోవటానికి 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఆర్వో ఇలా త్రిపాఠి తెలిపారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆమె గురువారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోటీలో ఉన్న అభ్యర్థులు పాఠశాల సమయాల్లో ప్రచారం చేయడం నిషేధమని, అనుమతి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో తీసుకోవచ్చని, మొత్తం నియోజకవర్గ అనుమతులు నల్లగొండ డీఆర్వో ద్వారా తీసుకోవాలని అన్నారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి ఫొటోలు పంపించాలని సూచించిన ఆమె ఈ నెల 10న ప్రచురించిన ఓటరు జాబితా ప్రకారం 25,797 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
నల్లగొండలోని ఆర్జాలబావి ఎస్‌డబ్ల్యుసీ గోదాములో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్నారు. కౌంటింగ్ సందర్భంగా 25 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చన్నారు. అనంతరం ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ అభ్యర్థులు ర్యాలీలు, సమావేశాలు, వాహనాల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల ఏజెంట్లకు నేర చరిత్ర ఉండొద్దని, లైసెన్స్ ఆయుధాలు ఉన్నైట్లెతే డిపాజిట్ చేయాలన్నారు. ప్రచారం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే చేసుకోవాలని, కౌంటింగ్ సందర్భంగా మూడంచెల భద్రత ఉంటుందని, సీసీ కెమెరాల నిఘాలో భద్రత పర్యవేక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.