ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 24: ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటుచేసిన ‘ఆటో షో’ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు రోజులపాటు కొనసాగిన వాహనాల ప్రదర్శన, విక్రయాల ఎక్స్పో ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, వాహన వినియోగదారుల సౌకర్యార్థం ఇటు బహుళజాతి కంపెనీల కార్లు, బైకులను; అటు బ్యాంకర్లను ఒకే వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కొన్నేళ్లుగా చేపడుతున్న విషయం విదితమే. దీంతో సదరు కంపెనీలకు సైతం మంచి ఆదరణ వస్తుండడంతో ఈ ఏడాది కూడా మరోమారు ఆటోషోను ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేశారు.
మీడియా పార్టనర్‌గా టీ న్యూస్, డిజిటల్ పార్టనర్‌గా సుమన్ టీవీల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మేళా ఆదివారం సాయంత్రంతో దిగ్విజయమైంది. ఖమ్మం నగరంలో రెండురోజుల పాటు కొనసాగిన ఈ ఎక్స్పోను అనేకమంది ప్రజలు, వాహన ప్రియులు సందర్శంచారు. వారి అభిరుచులకు తగినట్లుగా వాహనాలను ఎంచుకున్నారు. వివిధ రకాల రుణాల కోసం మేళాలో ఏర్పాటైన ఎస్బీఐ, కెనరా, యూనియన్ బ్యాంకుల స్టాళ్లను వాహనదారులేగాక రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు కూడా సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పలు వాహనాలను బుక్ చేసుకొని బ్యాంకర్లను సంప్రదించారు.
ఆధునిక నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో మెట్రోపాలిటన్ సిటీల్లో ఏర్పాటు చేసే విధంగా ఆటో ఎక్స్పోను కొలువుదీర్చడం పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తొలి రోజు కార్యక్రమానికి కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. రెండోరోజు ముగింపు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సహా మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ కంపెనీల స్టాళ్ల యజమానులకు, నిర్వాహకులకు మెమెంటోలు అందజేశారు.
ఆటో ఎక్ప్‌పో ఏర్పాటుచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్టాళ్లను సందర్శించిన ప్రతి ఒక్కరికీ కూపన్లు అందజేసిన నిర్వాహకులు.. ప్రతి గంటకూ ఒకసారి లక్కీడిప్ తీశారు. విజేతలకు అక్కడే బహుమతులు అందజేశారు. దీంతో సందర్శకుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఖమ్మం బ్రాంచి మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, యాడ్స్ డిప్యూటీ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు, యాడ్స్ ఆఫీసర్లు నాగరాజు సురేందర్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, సురేశ్, కరుణాకర్, దశరథ్, రిపోర్టర్లు శీలం శ్రీనివాస్, మద్దెల లక్ష్మణ్, గోపాల్‌రావు, పూనాటి మనోజ్, శ్రీనివాసరావు, బ్రహ్మం, సర్క్యులేషన్ సిబ్బంది టీ.భద్రం, బీ.భిక్షంరెడ్డి, ఎన్.గోవిందచారి, సీహెచ్ శ్రీను, కే.గోపాలకృష్ణ, ఆర్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కొత్తగా కార్లు గానీ, ద్విచక్ర వాహనాలు గానీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇలాంటి మేళాలతో ఎంతో అవగాహన కలుగుతుంది. ఒకే దగ్గరికి వెళ్లి వాహనం కొనుక్కోవచ్చు. కానీ ‘మార్కెట్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఏయే మోడళ్లు అందుబాటులో ఉన్నాయి? వాటి ఫీచర్లు ఏంటి?’ అనే వివరాలు తెలయవు కదా. ఈ రోజు ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. రెండు కంపెనీల వాళ్లను, బ్యాంకు వాళ్లను కలిసి వివరాలను అడిగి తెలసుకున్నాను. నాకున్న సందేహాలు నివృత్తి అయ్యాయి. ‘నమస్తే తెలంగాణ’ చేసిన ఈ ఆలోచన ఎంతో బాగుంది.
-ఏ.నర్సింహారావు, వేపకుంట్ల, సందర్శకుడు
హైదరాబాద్ తరహాలో ఆటోఎక్స్పోను ఖమ్మంలో ఏర్పాటు చేయడం నగరవాసులకు ఎంతో ప్రయోజనకరం. కారు కొనుక్కోవాలంటే నగరంతోపాటు ఖమ్మం రూరల్ పరిసర ప్రాంతాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ ఆటో ఎక్స్పో అని తెలయగానే కుటుంబంతో కలిసి వచ్చాను. ఈ రోజు అన్ని రకాల కంపెనీల స్టాళ్లు చూశాను. వాటి ధరలు, ఫీచర్లను ఆయా సంస్థల ప్రతినిధులు చక్కగా వివరించారు. ఎక్స్‌పోలో ‘నమస్తే తెలంగాణ’ నిపుణ గురించి కూడా వివరాలు తెలుసుకున్నాను. బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి రుణ సదుపాయం వివరాలు తెలుసుకున్నాను. అవసరమైన వారి ఫోన్ నెంబర్లు నమోదు చేసుకున్నాను.
-గోపీనాథ్, టీచర్, ఖమ్మం నగరవాసి
ఆటో ఎక్స్‌పోలతో వినియోగదారులకు అన్ని రకాల వాహనాలపై మంచి అవగాహన కలుగుతుంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే చేసిన ఈ ప్రయత్నం హర్షణీయం. ఇలాంటి వేదికలు మున్ముందు మరిన్ని ఏర్పాటు కావాలి. గ్రీన్‌హోండా అంటే వినియోగదారులకు చెప్పాల్సిన అవసరమే లేదు. దశాబ్దాల తరబడి మా షోరూంలలో వేలాదిమంది వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాం.
-రెడ్డిమళ్ల ఉపేందర్, సేల్స్ మేనేజర్, గ్రీన్‌హోండా
టాటా కంపెనీ కార్లు అంటేనే ప్రయాణికులకు ఎంతో నమ్మకం. సేఫ్టీని ఇవ్వడంతోపాటు మంచి లగ్జరీగా ఉంటాయి. అన్ని రకాల ఫీచర్లు ప్రెజెంట్ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన వినియోగదారులు గూగుల్‌లో సెర్చ్ చేసుకొని అయినా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కొనుగోలు చేసేందుకు గాను వినియోగదారులు ఆసక్తి చూపితే స్వయంగా వాహనం తీసుకొచ్చి డెమో ఇస్తాం. రెండు రోజులపాటు జరిగిన ఈ ఎక్స్‌పోలో మా కంపెనీ కార్లకు మంచి ఆదరణ కన్పించింది.
-ఎన్.మనోజ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, టాటా మోటార్స్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యాలు ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్పో ప్రదర్శన నిర్ణయం సంతోషించదగ్గ విషయం. వినియోగదారుల సౌలభ్యం కోసం ఒకేచోట వాహనాలు, రుణ సదుపాయం కల్పించే బ్యాంకులు ఉండడంతో వారికి మార్గం సుగమమైంది. మా సంస్థకు చెందిన వివిధ మోడళ్ల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. రెండురోజుల పాటు సాగిన ఈ ఆటో ఎక్స్‌పోలో మా వాహనాల ప్రదర్శనకు మంచి ఆదరణ వచ్చింది. ఖమ్మం నగర పుర ప్రముఖులు మా కార్లను టెస్టు డ్రైవ్ చేసి ప్రశంసలు ఇచ్చారు. బుకింగ్‌లు కావడం సంతోషంగా ఉంది.
-బీ.నారాజు, ఏఎస్ఎం జీప్ కంపెనీ
వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన వాహనాలను అందించడమే కియా కంపెనీ ధ్యేయం. ఇప్పటికే మా కంపెనీ నుంచి విడుదలైన అనేక మోడళ్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ కన్పిస్తోంది. ఈ రెండు రోజులపాటు జరిగిన ఎక్స్‌పోలో మా స్టాల్‌ను సందర్శంచిన ప్రతి వినియోగదారుడికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ‘నమస్తే తెలంగాణ’ చేసిన ఈ ఆలోచన వేరీ హ్యాపీ. ఇలాంటి ప్రదర్శనలతో వినియోగదారులకు, కంపెనీలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
-ఎన్.మహేశ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కియా ఆటోమోటివ్
ఖమ్మంలో ఏర్పాటుచేసిన ఈ ఆటో ఎక్స్పో ద్వారా అనేకమంది ప్రజలకు మా కంపెనీ మరింత చేరువైనట్లయింది. కటకం హోండా కంపెనీ వాహనాలకు మార్కెట్లో ఎంతో ప్రత్యేకత ఉంది. అందువల్లనే వివిధ వర్గాల ప్రజలు, అనేక మంది వ్యాపారులు మా స్టాల్‌ను సందర్శించారు. దీంతో రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేకమంది నూతన కస్టమర్లను సొంతం చేసుకునేందుకు మార్గం సులువైంది.
-పీ.సతీశ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కటకం హోండా
స్పార్క్ హీరో కంపెనీ అంటే తెలియని వారు ప్రస్తుత సమాజంలో ఎవరూ లేరు. నిత్యం వినియోగదారుల అభిరుచులు, వారి అభిప్రాయాలకు అనుగుణంగా నూతన మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. పల్లెల నుంచి మొదలుకొని నగరాల వరకు ప్రతి ఒక్కరూ హీరో వాహనాలను దశాబ్దాల నుంచి ఆదరిస్తున్నారు. మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి సరికొత్త వాహనాలను కూడా మా కంపెనీ తీసుకొచ్చింది. మా షోరూముకు వచ్చిన కస్టమర్లకు మెరుగైన సేవలందించడమే మా కంపెనీ ప్రధాన లక్ష్యం.
-జీ.అనూప్, ఎండీ స్పార్క్ హీరో