రఘునాథపాలెం, నవంబర్ 7: అధునాతన మోడళ్లు, సరికొత్త ఫీచర్లతో కూడిన కార్లు, బైకుల ప్రదర్శనకు ఖమ్మం నగరం వేదికకానుంది. ఖమ్మంలోని ఆటో షోరూం సంస్థలన్నీ ఒకేచోట కనిపించనున్నాయి. ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఈ నెల 8, 9 తేదీల్లో ‘నమస్తే తెలంగాణ’,‘తెలంగాణ టుడే’ సంస్థలు ఆటో షోను నిర్వహిస్తున్నాయి. ఈ ఆటో ఎక్స్పోలో ఆయా కంపెనీలు తమ అన్ని మోడల్ వాహనాలను ప్రదర్శనలో ఉంచనున్నాయి. వాహన కొనుగోలుదారులు తమకు నచ్చిన వాహనాన్ని చూసి కొనుగోలు చేసుకునే చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఇప్పటివరకు కేవలం పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన ఈ ఆటో షో ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ సంస్థలు కొత్తగా ఉమ్మడి జిల్లా ప్రజలకు చేరువ చేసింది. ఏ వాహనం ఎంత ధరలో ఉందో, కావాల్సిన ఫీచర్స్ ఏ వాహనంలో ఉన్నాయో ప్రత్యక్షంగా తెలుసుకొని టెస్ట్ రైడ్ చేసి మరీ కొనుగోలు చేసుకునే చక్కటి అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో జరిగే ఈ ఆటో షోను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ షో సందర్భంగా కంపెనీలు పలు వాహనాలపై పెద్ద మొత్తంలో అందించే రాయితీలనూ పొందొచ్చు.
ఈ ఆటో షోలో వాహనాలను ప్రదర్శించడమే కాదు.. కొనుగోలు చేసే వాహనానికి బ్యాంకర్లు అందుబాటులో ఉండి రుణ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. వాహనాలకు రుణ సౌకర్యం కల్పించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల అధికారులు అక్కడే అందుబాటులో ఉండి రుణాలు, వడ్డీల వివరాలను తెలియజేస్తారు. ఏ బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ లభిస్తుందో తెలుసుకొని వాహనం కొనుగోలు చేయవచ్చు. ఆటో షోకు వచ్చే సందర్శకులకు ‘నమస్తే తెలంగాణ’ కూపన్లను అందించి లక్కీడిప్ ద్వారా బహుమతులు అందించనున్నారు.
ఈ ఆటో షోలో వాహన కంపెనీలైన మహావీర్ బెంజ్, మహావీర్ గ్రూప్స్ స్కోడా, కాకతీయ టయోటా, భారత్ హ్యూండయ్, వీవీసీ టాటా మోటార్స్, ఆర్కా రెనాల్ట్, ఆర్కా ఆటోమోటివ్స్ ఎల్ఎల్పీ హోండా, వీవీసీ మహీంద్రా, ఆటోమోటివ్ కియా, వెంకటరమణ బజాజ్, రాయపూడి సుజుకీ, వరుణ్ మోటార్స్ మారుతీ సుజుకీ ఎరినా తదితర కంపెనీలకు చెందిన అన్ని రకాల వాహనాలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు వాహనాలకు రుణాలు ఇచ్చేందుకు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్లు ఆటో షోలో తమ స్టాళ్లలో అందుబాటులో ఉంటాయి.