ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 24: తెలంగాణ ఆవిర్భావానికి ముందు, ఆ తరువాత ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తున్న తీరు ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఏర్పాటుచేసిన ఆటో షో ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఎక్స్పోలోని వివిధ కంపెనీల స్టాళ్లను పరిశీలించారు.
ఆయా మోడళ్ల వాహనాల వద్దకు వెళ్లి వాటి ఫీచర్ల గురించి వాకబు చేశారు. పలు బైకులను టెస్ట్ రైడ్ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయా సంస్థల ప్రతినిధులను, నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలో ఆటో, ప్రాపర్టీ షోలతో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఘనత నమస్తే తెలంగాణకే దక్కుతుందని అన్నారు. ఇలాంటి షోల ద్వారా అటు కంపెనీల బాధ్యులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఒకే వేదికపై అనేక సంస్థలు ఉండడం వల్ల వినియోగదారులు అన్ని స్టాళ్లను సందర్శించి వాటి బాధ్యులను సంప్రదించి వాహనాలను కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుందని వివరించారు.
అనంతరం నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, టీ న్యూస్ జిల్లా ప్రతినిధి సాంబశివరావు మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఆటో షోకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ అనేక కార్యక్రమాలు చేపట్టి అటు ప్రజలకు, ఇటు కంపెనీలకు అనుసంధానకర్తలుగా వ్యవహరించేందుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మెమెంటోలు అందజేశారు. శాలువాలతో వారిని సత్కరించారు. మాజీ కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.