నేలకొండపల్లి, ఏప్రిల్ 9: కేంద్రంలోని బీజేపీ కుట్రలు, కుతంత్రాల పార్టీ అని, అబద్ధాలను ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్న పార్టీ అని బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో ఆదివారం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త శేరి సుభాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ఒకవైపు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే, కేంద్రం మాత్రం రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చి వందేభారత్ రైలును ప్రారంభించారని, గతంలో అదే పేరున్న రైళ్లను వేర్వేరు చోట్ల ప్రారంభించారన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి గతేడాది జీఎస్టీ ద్వారా రూ.30 వేల కోట్ల ఆదాయం వెళ్లిందన్నారు. దానిలో 41 శాతం రాష్ర్టానికి వాటా రావాల్సి ఉండగా కేవలం 26 శాతం మాత్రమే అందిందన్నారు. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు వెనుకబడిఉన్నాయని, వాటి అభివృద్ధికి కేంద్రం రూ.1,350 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఒక్కపైసా అయినా ఇవ్వలేదన్నారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు మౌలిక వసతులు లేక ఇబ్బందిపడేవారన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే సాగు, తాగునీటి కష్టాలకు పరిష్కారం లభించిందన్నారు. కార్యకర్తలు, నాయకులు తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపేందుకు పనిచేయాలన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, జడ్పీటీసీ ఇంటూరి బేబి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ నంబూరి శాంత, ఆత్మ కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఎంపీపీలు వజ్జా రమ్య, బానోతు శ్రీను, బెల్లం ఉమ, బోడ మంగీలాల్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శాఖమూరి సతీశ్, బీఆర్ఎస్ వివిధ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, బెల్లం వేణు, వేముల వీరయ్య, బాషబోయిన వీరన్న, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి, నాయకులు వెన్నబోయిన శ్రీను, వజ్జా శ్రీనివాసరావు, మరికంటి రేణుబాబు, భూక్యా సుధాకర్, సర్పంచులు పాల్గొన్నారు.
దార్శనికుడు కేసీఆర్…
గొప్ప దార్శనికుడు సీఎం కేసీఆర్. ఆయనతోనే దేశంలో గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. మహాత్మా గాంధీ కలలు నెరవేరతాయి. ప్రజల కలలను సాకారం చేస్తూ ఇప్పటికే కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి బాట పట్టించారు. రాష్ర్టానికి జాతిపిత ఆయ్యారు. నాటి ఉమ్మడి పాలకులు తెలంగాణ వస్తే రాష్ట్రంలో అంధకారం వస్తుందన్నారు. కానీ ఇప్పుడు కరెంట్ కోతలు లేని రాష్ట్రం ఏర్పడింది. గతంలో మంచినీళ్ల కోసం మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు ఇంటికే వస్తున్నాయి. ప్రాజెక్ట్‌ల నిర్మాణంతో అడుగడుగూ సస్యశ్యామలమైంది. ఆ ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కింది. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని వాటిని కూడా అమలు చేస్తున్నారు. యావత్ దేశమంతా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి అమలు చేయడమే కేసీఆర్ లక్ష్యం. అది తట్టుకోలేక బీజేపీ నాయకులు బీఆర్ఎస్పై దుమ్మెత్తి పోస్తున్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను నాయకులు ప్రజలకు వివరించాలి.
– ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త శేరి సుభాశ్‌రెడ్డి
ఎన్నికల సమరానికి సిద్ధం కావాలి..
రానున్న సాధారణ ఎన్నికలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలి. విజయం సాధించి పార్టీ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచాలి. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించింది. ఇదే ఒరవడిలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సైనికుల్లా పనిచేద్దాం. ప్రజలను చైతన్యవంతులను చేసే లక్ష్యంతోనే పార్టీ అధిష్ఠానం ఆత్మీయ సమ్మేళనాలకు ఆదేశించింది. నాయకులు భేషజాలు వదిలేయాలి. అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలి. పార్టీ ఆదేశాలను శిరోధార్యంగా పాటించాలి. ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న వారే భవిష్యత్తులో నాయకులవుతారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలి. దేశంలోనే 64 లక్షల సభ్యత్వం ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేయాలి.
– ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు
మానవ సంబంధాలే గొప్పవి…
కులాలు, మతాలు, రాజకీయాలకన్నా మానవ సంబంధాలు ఎంతో గొప్పవి. నాయకులు, కార్యకర్తలందరూ ఒక్కటేనని చాటి చెప్పేందుకే బీఆర్ఎస్ అధిష్ఠానం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. సమ్మేళనాల్లో నాయకులు, కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటున్నది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది. పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అందుకు అనుగుణంగా పనిచేయడం మన విధి. పాలేరు నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాను. చదువు, ఆర్యోగం విషయంలో ప్రజలకు సాయపడుతున్నాను. గ్రామస్థాయిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాను.
– పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి