టేకులపల్లి, ఫిబ్రవరి 19 : మొర్రేడు వాగు ఇసుక రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ ర్యాంపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కొందరు అక్రమార్కులు ఇదే అదనుగా భావించి రాత్రికే రాత్రే ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. దీంతో స్థానిక గ్రామపంచాయతీలతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఆమ్యామ్యాలకు అటవాటుపడిన సంబంధిత శాఖల అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టేకులపల్లి మండలం శంభునిగూడెం వద్ద 2018కి ముందు ప్రభుత్వ అనుమతితో ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్రామపంచాయతీకి, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. ఆ తర్వాత ప్రభుత్వం ర్యాంపు ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఈ క్రమంలో మొర్రేడు వాగు పరీవాహకంలోని శంభునిగూడెం, చంద్రుతండా, సంపత్‌నగర్, మేల్లమడుగు, గంగారం, లచ్చగూడెం, బోడు, బొమ్మనపల్లి, జంగాలపల్లి, మొట్లగూడెం వద్ద ముర్రేడు వాగు ప్రాంతాల్లో సహజంగానే ఇసుకను తరలించడానికి బాటలు ఉన్నాయి. దీంతో ఇసుకాసురులు అధికార పార్టీ నాయకుల అండదండలతోపాటు కొందరు ప్రభుత్వ అధికారులను మచ్చిక చేసుకొని రాత్రి సమయాల్లో ఇసుకను తరలించడమే పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇల్లెందు, కారేపల్లి, కొత్తగూడెం, ఖమ్మం తదితర ప్రాంతాలకు ఇసుకను తరలించి.. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఏజెన్సీ గ్రామాల్లో రాత్రి సమయాల్లో ట్రాక్టర్ల ద్వారా మితిమీరిన వేగంతో అక్రమంగా ఇసుకను తరలించే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వాహనదారులతోపాటు బాటసారులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిరుపేద ట్రాక్టర్ డ్రైవర్లకు డబ్బుల ఆశ చూపి రాత్రి సమయాల్లో ఎక్కువగా వారిని వినియోగించుకుంటున్నారు. ఉన్నతాధికారులు ట్రాక్టర్ల వేగాన్ని నియంత్రించకపోతే మున్ముందు మరింత మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అంతేకాక మండలం నుంచి ప్రతి రోజు 80 నుంచి 120 ట్రాక్టర్ల ఇసుకను ఇతర ప్రాంతాలకు రాత్రి సమయంలోనే రవాణా చేస్తున్నారంటే వారి అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
చర్ల, ఫిబ్రవరి 19 : పెద్దిపల్లి గిరిజన సొసైటీ ద్వారా అనుమతి పొందిన ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు తవ్వకాలు నిలిపివేశారు. పేరుకు గిరిజన సహకార సంఘం అయినప్పటికీ పెత్తనం అంతా అక్రమార్కులదే కావడంతో తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్న సామెతలా ఉంది పరిస్థితి. ఈ ర్యాంపులో నిబంధనల ప్రకారం కాకుండా యంత్రాలతో ఇసుకను తవ్వుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తమకు అందిన సమాచారం మేరకు జిల్లా అధికారులు.. స్థానిక అధికారులను దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్ భరణిబాబు, మైనింగ్ ఏడీ జైసింగ్.. పెద్దిపల్లి ర్యాంపు వద్దకు వెళ్లి దర్యాప్తు చేశారు. వెంటనే అక్రమ తవ్వకం పనులను నిలిపివేశారు. నిర్వాహకులకు జరిమానా సైతం విధించారు.
మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంది. అక్రమ ఇసుక రవాణా రాత్రి సమయంలో చేస్తుండడంతో ఆ శబ్దానికి నిద్ర కూడా పట్టడం లేదు. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడుపుతుండడంతో బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే బాగుంటుంది.
శంభునిగూడెం పంచాయతీ పరిధిలో ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతున్నది. ప్రభుత్వం ఇక్కడ ర్యాంపునకు అనుమతి ఇస్తే రాత్రి వేళల్లో ఇసుక తరలింపు ఆగిపోతుంది. పగలు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
మండల పరిధిలో రాత్రి, పగలు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్లపై ట్రాక్టర్లు అతి వేగంగా వెళ్లడంతోపాటు ఎక్కడైనా ఇసుక రవాణా జరిగితే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఇసుక రవాణాదారులపై కేసులు నమోదు చేస్తాం.