ముదిగొండ : ముదిగొండ మండల కేంద్రం శివారులో వృద్ధగిరి గుట్టపై స్వయంభువుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఎంతో ఆధ్యాత్మికతోపాటు ప్రాచీన చరిత్ర ఉన్నది. చాళిక్యులతోపాటు కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ప్రకృతి అందాల మధ్య గుట్టపై వెలిసిన స్వామి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించి కోర్కెలు కోరుకుంటే వెంటనే నెర వేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయానికి ప్రతి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
స్వామిని దర్శించుకోవటానికి 150 మెట్లు ఎక్కాల్సి ఉన్నా భక్తులు ఎలాంటి అలసట చెందకుండా దర్శించుకుంటారు. సుమారు రెండు శతాబ్దాల క్రితం ఓ భక్తుడికి స్వామి కలలో సాక్షాత్కరించి గ్రామ శివారులోని గుట్టపై లక్ష్మీ సమేతంగా వెలిసినట్లుగా తెలిపారు. మరుసటి రోజు గ్రామస్తులు గుట్టపైకి వెళ్లగా అక్కడ ఓ సొరంగంలో శంక, చక్ర, అభహస్తములతో స్వామి వారు దర్శనమిచ్చారు. గుట్టపై ఎలాంటి నిర్మాణం సాధ్యం కాకపోయినా చిన్న ఆలయం నిర్మించి పూజలు చేయటం ప్రారంభించారు. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అడవితో నిండి ఉండి పులులు, సింహాలు సంచరిస్తుండటంతో శనివారం మాత్రమే స్వామి వారికి నైవేద్యం పెట్టేవారు.
కాల క్రమంలో అడవి మాయం కావటంతో గ్రామస్తులు రోజు స్వామిని వారిని దర్శించుకుంటున్నారు. నిత్యం దూప దీప నైవేద్యాలతోపాటు పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. వైశాఖ పౌర్ణమి రోజున స్వామి వారి బ్రహ్మోత్సవాలు, తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మెట్ల పూజ ప్రత్యేకంగా నిర్వహించి పాల పొంగల్లతో మొక్కులు చెల్లించుకుంటారు. లక్ష్మీనర్సింహ స్వామి గుట్ట ఆధ్యాత్మికత మాత్రమేగాక ప్రాచీన చరిత్రను కూడా కలిగి ఉన్నది. చాళిక్యులు ముదిగొండను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అందుకే వీరిని ముదిగొండ చాళిక్యులు అంటారు.
కాకతీయ రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు చరిత్ర చెబుతున్నది. ఈ గుట్టకు దగ్గరలోనే చెన్నకేశవ స్వామి ఆలయాన్ని అప్పటి కాకతీయు రాజులు ప్రతిష్టించినట్లు శిలా శాసనాలు, ఆధారాలు ఉన్నాయి. యుద్ధ సమయంలో గుట్టపై ఉంటూ కింద ఉన్న చెరువును కోనేరుగా చేసుకుని స్నానాలు ఆచరించి స్వామికి అర్చనలు, నైవేద్యాలు సమర్పించి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసే వారని స్థల పురాణం చెబుతున్నది. గతమెంతో ఘన కీర్తీగా ఉన్న ఈ దేవాలయం అభివృద్ధికి నోచుకోక శిథిలావస్తకు చేరుకున్నది.
ఆలయానికి 40 ఎకరాల మాన్యం ఉంది. దేవాదాయ శాఖ వారు ప్రతి ఏటా ఈ భూమిని కౌలుకు ఇస్తారు. ఈ భూమి కొంత అన్యాక్రాంతం కాగా వెలికి తీయాల్సిన అవసరమున్నది. గుట్టపైన ఉండటంతో చెట్లు, పెద్దపెద్ద రాళ్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటీవల గుట్ట పక్కగా నిర్మించిన జాతీయ రహదారి మరింత ఆకర్షణగా మారింది. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయ్యాక భక్తల సంఖ్య మరింత పెరిగింది. సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తలు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.