బోనకల్లు, జనవరి12 : కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ తెలిపారు. రామాపురం, గార్లపాడు గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత రామాపురం, గార్లపాడు గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు తొండపు వేణు, దారెల్లి నర్సమ్మ, ఎంపీటీసీ ముక్కపాటి అప్పారావు, ఎంపీవో కోటేశ్వరశాస్త్రీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, జనవరి 12: ఈ నెల 18 నుంచి నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ కోపూరి పూర్ణయ్య తెలిపారు. గురువారం ఆయన పీహెచ్సీలో పంచాయతీరాజ్, వైద్యం, ఆరోగ్యం, ఐకేపీ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఇంటింటికెళ్లి కంటివెలుగు కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి తోళ్ల వెంకటేశ్వర్లు, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, పల్లెదవాఖానా వైద్యులు, ఆశాకార్యకర్తలు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, జనవరి 12: రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ బెల్లం ఉమ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండల సమావేశ మందిరంలో కంటివెలుగుపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆమె కంటివెలుగు కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీఈవో శ్రీనివాసరావు, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీదేవి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.