కారేపల్లి, ఆగస్టు 20 : ఖమ్మం జిల్లా కారేపల్లి జంక్షన్ మీదుగా భద్రాచలం రోడ్డు నుండి డోర్నకల్ జంక్షన్ మధ్యలో నడిచే రైళ్లను పునరుద్ధరించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే జీఎంకు లేఖ రాశారు. కరోనా సమయంలో డోర్నకల్ జంక్షన్, భద్రాచలం రోడ్డు మధ్యలో నడిచే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా కరోనా తర్వాత కాజీపేట- మణుగూరు, డోర్నకల్ జంక్షన్- భద్రాచలం రోడ్డు మధ్యలో నడిచే రైళ్లను ఐదు సంవత్సరాలు పూర్తయినా నేటికి పునరుద్ధరించలేదని కారేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి ఎంపీ రఘురాం రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న మిగతా రైళ్లకు కూడా రైల్వే శాఖ పోచారం, గాంధీపురం, చీమలపాడు, తడికలపూడి, బేతంపూడి స్టేషన్లలో హాల్టింగ్ తీసివేసిందని, ప్రస్తుతం నడుస్తున్న ఈ రైళ్లకు ఈ స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వాలని సురేందర్ రెడ్డి ఎంపీకి వినతిపత్రం అందజేశారు.
స్పందించిన ఎంపీ రఘురాం రెడ్డి రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని, భద్రాచలం రోడ్డు -డోర్నకల్ జంక్షన్ మధ్యలో ఉన్న అన్ని స్టేషన్లలో అన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మాదారం రోడ్డులో కారేపల్లి నుండి ఇల్లందు, గాంధీపురం వద్ద గల గేట్ల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని, భద్రాచలం రోడ్డు నుండి తిరుపతికి ప్రతిరోజు ఎక్స్ ప్రెస్ రైలు నడపాలని కోరుతూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలుస్తానని ఎంపీ తెలిపారని సురేందర్ రెడ్డి వెల్లడించారు.
Karepalli : రద్దైన రైళ్లను పునరుద్ధరించాలని రైల్వే జీఎంకు ఎంపీ రఘురాంరెడ్డి లేఖ