భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామునే మార్నింగ్ వాక్‌తో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. కొత్తగూడెంలోని ప్రకాశ్ స్టేడియం, ప్రగతి మైదానం, సెంట్రల్ పార్కులో వాకింగ్ చేస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. మేడే సందర్భంగా కార్మిక వర్గాలను, ప్రజలను కలుసుకొని విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలిసి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నేను రాజకీయాల్లోకి రాకముందే పాల్వంచ కేటీపీఎస్‌లో పని చేసిన రోజులు, ఆనాడు కార్మికులు, తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి ఉన్న పరిస్థితులను ఆయన గుర్తు చేశారు. నేను మీ వాడిని.. ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపిస్తే కొత్తగూడేన్ని మరింత అభివృద్ధి చేస్తానని, మూడోసారి గెలిపిస్తే జిల్లా గొంతుకను పార్లమెంట్లో వినిపిస్తానన్నారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి 120 లేఖలు రాశానని గుర్తు చేశారు.
రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు ఏనాడూ పార్లమెంట్లో రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదని, కనీసం నా పోరాటానికి కూడా సహకరించలేదన్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకుడు మోరె భాస్కర్, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు కొట్టు వెంకటేశ్వరరావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సంకుబాపన అనుదీప్, పాల్వంచ పట్టణ నాయకులు రామణమూర్తి నాయుడు, రేగడి మధు, జవహర్, సింధు తపస్వి, అన్వర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.