వేంసూరు, సెప్టెంబర్ 26: కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీ హామీలకు వారంటీ ఏమీ లేదని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆరు గ్యారెంటీ హామీలంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్న మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. వేంసూరు మండలం లో మంగళవారం పర్యటించిన వారు.. దిద్దుపూడి, భరణిపాడు, కందుకూరు, వెంకటాపురం, మర్లపాడు, వేం సూరు, బీమవరం గ్రామాల్లో సుమారు రూ.37 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆయా సభల్లో వారు మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్కు పేదలు గుర్తొచ్చారని విమర్శించారు. 60 ఏళ్ల పాలనలో ఇలాం టి గ్యారెంటీ హామీలకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
పొరుగున్న ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోనూ తెలంగాణ లాంటి పథకాలను లేవని స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలోనే అద్భుత పాలన అందిస్తున్న కేసీఆర్ను మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. కందుకూరులోని రెండు దళితకాలనీల్లో డ్రైనేజీల ఏర్పాటుకు ఎమ్మెల్యేతోపాటు తన నిధుల నుంచి సుమారు రూ.80 లక్షలను వెచ్చించినట్లు చెప్పారు. వెంకటాపురం గ్రామాభివృద్ధికి తన సొంత నిధుల నుంచి రూ.10 లక్షలను అందిస్తున్నట్లు చెప్పారు. మర్లపాడులో 38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను వారు పంపిణీ చేశారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ సంజీవరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు పాల వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.