‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం ఆ రూపం. తాను నమ్మిన సిద్ధాంతం కోసం లక్ష్యం సిద్ధించే వరకు పోరాడే మహానేత ఆయన. సామాన్యుడి కష్టాలను స్వయంగా చూసి వాటికి పరిష్కార మార్గాలను చూపిన దార్శనికుడతడు. ఆయనే ఉద్యమ నేత, సీఎం కేసీఆర్.’ అంటున్నారు తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నగర మాజీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న ఆయన.. గురువారం సీఎం జన్మదినం సందర్భంగా బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. కేసీఆర్ వ్యక్తిత్వం, తెలంగాణ కోసం పరితపించే స్వభావం, ఉద్యమ వ్యూహ రచనా శైలి వంటి వాటి గురించి వివరించారు. నాటి జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..
ఖమ్మం, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర సాధన కోసం కరీంనగర్లో కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు పూనకున్నారు. పోలీసులు ఆ దీక్షను భగ్నం చేసి ఆయనను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అప్పుడు నేను రెండు రోజులపాటు జిల్లా జైలులో కేసీఆర్‌తో గడిపాను. ఉద్యమ నాయకుడిగా, జైల్లో సహచరుడిగా కేసీఆర్‌తో నాకు అనుబంధం ఉంది. ఉద్యమ నేతగా తెలంగాణ ప్రజల కోసం నిరంతరం శ్రమించేవారు కేసీఆర్. ప్రజల కష్టాలను ఆసాంతం చూసిన ఆయన.. ఆ అనుభవంతోనే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లాలో 2002 నుంచి నేను కీలకంగా వ్యవరించాను. 32 కేసులు నమోదు కాగా 120 రోజులు జైలు జీవితం గడిపాను. అదేమిటో.. కేసీఆర్‌ను చూసిన తరువాత మేము పడుతున్న ఇబ్బంది పెద్దదేమీ కాదనిపించింది. ఒక వైపు భావజాల వ్యాప్తి, మరో వైపు తెలంగాణ ఉద్యమం, ఇంకో వైపు రాజకీయ పార్టీని ఏకకాలంలో నడిపిన అరుదైన ప్రజానేత కేసీఆర్. పదునైన రాజకీయ వ్యుహాత్మక నైపుణ్యంతో తెలంగాణ సాధిస్తామని పార్టీ కార్యకర్తలమైన మాకు కేసీఆర్ ఎప్పుడు దిశా నిర్దేశం చేసేవారు. తెలంగాణ వచ్చి తీరుతుందన్న విశ్వాసాన్ని పార్టీ స్థాపించిన రోజే ఆయన వ్యక్తం చేశారు. ఎలా వస్తుందో కూడా ఆరోజే విశ్లేషించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించే సమయంలో 42 పార్టీలు ప్రాతినిథ్యం కలిగి ఉంటే 36 పార్టీల మద్దతు కూడగట్టడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైంది. తన లక్ష్యం కోసం గొంగళిపురుగునైనా ముద్దాడుతానని చెప్పడం ద్వారా తాను ఎవరికీ శత్రువుని కాదని, తెలంగాణ కోసం ఉద్యమం ఎవరు చేసినా స్వాగతించి వారి అడుగులో అడుగు వేస్తానని చెప్పారాయన.
ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాక తనతో వచ్చిన ప్రతి ఒక్కరినీ కలుపుకపోయి ఉద్యమ తీవ్రతను నాటి ప్రభుత్వాలకు తెలియజేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్‌ను అక్రమంగా అరెస్టు చేసి ఆమరణ దీక్షను భగ్నం చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. కేసీఆర్‌తోపాటు నన్నూ జైలుకు పంపించారు. నా దృష్టంతా జిల్లాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఎలాంటి ఆందోళనలు చేయాలో, ప్రజలను ఎలా సమీకరించాలో అనే విషయంపై ఉంది. వీటిని భగ్నం చేస్తూ ఖమ్మం పోలీసులు నన్ను అరెస్టు చేసి కేసీఆర్‌తోపాటు జైలుకు పంపించారు. ఆ కేసులో కేసీఆర్ ఏ1, అయితే నేను ఏ2గా ఉన్నాను. ఉద్యమం కోసం కేసీఆర్ న్యాయకత్వంలో పనిచేశానన్న సంతృప్తి మిగిలింది. జైలు నుంచి కేసీఆర్‌ను ఆసుపత్రికి తరలించే సమయంలో ఆయనకు ముప్పు కల్పిస్తారేమోనన్న భయంతో పోలీసులను అడ్డుకున్నాను. అప్పటి ఎస్పీ క్రాంతిరాణా టాటా ఆధ్వర్యంలోని పోలీసులు మా నుంచి కేసీఆర్‌ను తీసుకెళ్లడానికి తీవ్ర ప్రతిఘటనే ఎదుర్కొన్నారు.
జైల్లో ఉన్న రెండు రోజులూ కేసీఆర్ పక్కనే నా పడక. ఆయన రోజుకు రెండు గంటలు కూడా నిద్ర పోయింది లేదు. తెలంగాణ సాధనపై చేయాల్సిన ఉద్యమంపై మాతో నిరంతరం మాట్లాడుతూనే ఉండేవారు. కరీంనగర్లో కేసీఆర్ ఆమరణ దీక్ష భగ్నం చేసి ఆయనతోపాటు నాయని నర్సింహారెడ్డి, విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, రాజయ్య యాదవ్‌లను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. వారి అరెస్టును నిరసిస్తూ ఖమ్మంలో మేము ఆందోళన చేయడంతో నాతో పాటు జూపల్లి రాంజగ్గారావు, అబ్దుల్ నబీ, బత్తుల సోమయ్య, గోపగాని శంకర్రావులను అరెస్టు చేశారు. కేసీఆర్‌ను జైల్లో పరామర్శించడానికి అప్పటి ఇంటెలిజెన్స్ విభాగ పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి సహా 8 మంది ఐజీలు వచ్చారు. అందులో మహేందర్‌రెడ్డి నన్ను చూసి.. ‘కేసీఆర్ గారు.. సుబ్బారావు ఉన్నాడు. మీకు ఇబ్బంది ఏమీలేదు’ అంటూ ధైర్యం చెప్పారు. ఉద్యమకారులు చెప్పిన మాటకు గౌరవం ఇవ్వడం, ఉద్యమానికి వారి సలహాలు తీసుకోవడం కేసీఆర్‌కు ముందు నుంచే అలవాటు. ఇందుకు ఉదాహరణే ‘తండాలో నిద్ర’. ఖమ్మానికి చెందిన చౌహాన్ అనే గిరిజన నేత తండాల్లో గిరిజన కష్టాలు చూడాలంటూ కోరారు. అప్పుడే కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా తండాల నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పుడు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఫలితమే ఈ రోజు అమలవుతున్న సంక్షేమ పథకాలు. ఈ సందర్భంగా ఉద్యమ నేత, సీఎం కేసీఆర్‌కు ఉద్యమకారుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు.