కొత్తగూడెం క్రైం, జూలై 28: ‘వామ్మో.. ఆ రహదారిలో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా ఒళ్లు గుల్ల కావడం ఖాయం.’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు, వాహనదారులు. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్న ఈ మార్గం ఎక్కడో కాదు.. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోనే. అది కూడా జిల్లా కోర్టు మీదుగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఇల్లెందుకు వెళ్లే మార్గంలోనే. కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి ఇల్లెందు వెళ్లే బైపాస్ (ఎల్ఐసీ ఆఫీస్) రోడ్డు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలమయంగా ఉంది. ఈ మార్గంలో ప్రయాణించేందుకు పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెం-ఇల్లెందు బైపాస్ రోడ్డులో వెళ్లాలని ఆలోచిస్తేనే నరకం కనిపిస్తోందని వాపోతున్నారు.
ముఖ్యంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి మొదలుకొని జిల్లా కోర్టుతోపాటు డీఎస్పీ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాల, చర్చీలు, ఎల్ఐసీ ఆఫీస్, జడ్పీ కార్యాలయం, ఆర్అండ్బీ కార్యాలయం, సింగరేణి సెంట్రల్ వర్క్‌షాపు, ఈద్గా, శేషగిరినగర్ కాలనీ మీదుగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లే కీలకమైన ఈ రహదారిలో భారీ గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇల్లెందుకు వెళ్లాల్సిన భారీ వాహనాల (బొగ్గు టిప్పర్లు)ను పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఈ మార్గం ద్వారానే మళ్లిస్తున్నారు. దీంతో ఈ రహదారి నిత్యం రద్దీగా మారుతోంది. ఇప్పుడు వర్షాకాలం కారణంగా భారీ గుంతలు ఏర్పడి, వాటిల్లో నీళ్లు నిండి రహదారి కన్పించడం లేదు. దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రతి రోజు మా పిల్లలను స్కూలుకి తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు మొత్తం గుంతలతో నిండి ఉండడంతో బొగ్గు టిప్పర్లు వస్తున్న సమయంలో ప్రమాదకంగా ఉంటోంది. మా కాలనీ నుంచి చాలామంది చిన్న పిల్లలు ఇదే దారిలో ప్రతి రోజూ నడుచుకుంటూ, ఆటోల్లో స్కూళ్లకు వెళ్తుంటారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంటోంది.
-దాము, శేషగిరినగర్
నేను ప్రతి రోజూ నా బైక్ మీద ఇదే రోడ్డులో ఉద్యోగానికి వెళ్లి వస్తుంటాను. ఈ రోడ్డు పొడువునా నీళ్లు నిలిచిన భారీ గుంతలు ఉండడంతో రాకపోకలు సాగించాలంటే ప్రత్యక్ష నరకం కన్పిస్తోంది. ఈ రోడ్డుపై వెళ్లి వస్తున్నందున మా వాహనాలు దెబ్బతింటున్నాయి.
-సొప్పరి ప్రశాంత్, వాహనదారుడు
వివిధ పనుల కోసం నేను తప్పనిసరిగా ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాను. అయితే ఈ రోడ్డుపై గుంతలు, జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే భయంగా అనిపిస్తోంది. అసలు ఈ రోడ్డు నరకంతో సమానంగా కన్పిస్తోందంటే అతిశయోక్తి కాదు. పెద్ద వాహనాలు కూడా ఇదే రోడ్డులో ప్రయాణిస్తుండడంతో ఎటునుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో అని భయంగా ఉంటోంది.
-సుమన్, కూలీలైన్