లక్ష్మిదేవీపల్లి, మార్చి 20 : మద్యానికి బానిస అయిన కొడుకు పెట్టే వేధింపులు తాళలేక కన్నతల్లే ఆ కొడుకును కడతేర్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎక్కులపల్లి రాజ్‌కుమార్(40) మద్యానికి బానిసయ్యాడు. తరచుగా తల్లి, భార్య, కొడుకును శారీరక, మానసిక వేధింపులకు గురిచేసేవాడు.
పలుమార్లు కుటుంబ సభ్యులు నచ్చజెప్పిన రాజకుమార్ వినలేదు. దీంతో అతడి వేధింపులు తాళలేక కన్నతల్లి దూడమ్మ రాజ్‌కుమార్ కాళ్లు, చేతులు కట్టేసి ఉరివేసి చంపింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు.