నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 10 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి, బుధవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ఓ యువకుడు, ఓ రైతు మృతిచెందగా, మరో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. రెండు పాడి గేదెలు మృతిచెందాయి. గుండాల మండలం చీమలగూడెం గ్రామానికి చెందిన పాయం నర్సయ్య(55) తన పంట చేనుకు మంగళవారం రాత్రి కాపలా వెళ్లాడు. ఈ క్రమంలో ఉరుములు మెరుపులతో వర్షంతోపాటు పిడుగుపడడంతో ధాటికి తట్టుకోలేక నర్సయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. బుధవారం ఉదయం నర్సయ్య ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పంట చేను వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు.
నర్సయ్య మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఇల్లెందుకు ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అలాగే సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన దారావత్ భాష, కాంతమ్మ దంపతుల కుమారుడు మహేశ్(31) గ్రామ శివారులో పశువులను మేపుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గాలివానతోపాటు పిడుగుపడడంతో మహేశ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మహేశ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మహేశ్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. కామేపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామ సమీపంలోని మిరప తోటలో రైతు గుగులోతు బావుసింగ్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వర్షంతోపాటు పిడుగుపడడంతో సమీపంలో ఉన్న బావుసింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే పని చేస్తున్న తోటి రైతులు, కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మండలంలోని మేకలతండాకు చెందిన గుగులోతు మోహన్‌రావు పాడి ఆవు మేత మేస్తుండగా పిడుగుపడడంతో ఆవు మృతిచెందింది. పాడి ఆవు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలో కట్టా సతీశ్‌కు చెందిన పాడి గేదె పిడుగుపాటుకు మృతిచెందింది.
పలు ఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయాయి. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై ప్రవహిస్తున్న వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్లో భారీ వర్షం కురవడంతో ప్రధాన సెంటర్ నీటిలో మునిగిపోయింది. మురుగు కాల్వలు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టేకులపల్లి మండలం తూర్పుగూడెం నుంచి ముత్యాలంపాడు వెళ్లే రోడ్డు మార్గంలో వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెగళ్లపాడు నుంచి ముత్యాలంపాడు వెళ్లే రోడ్డు వర్షానికి కోతకు గురైంది. దీంతో రాకపోకలను పంచాయతీ సిబ్బంది నిలిపివేశారు.