ఖమ్మం సిటీ, జూలై 2 : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ సామ్రాజ్యాన్ని బద్దలుకొట్టి ఖమ్మం జిల్లాలోనే ఆయనకు రాజకీయ సమాధి కడతామని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరువురూ కాంగ్రెస్‌లో ఉంటూనే బీజేపీతో సంసారం చేస్తున్న రాజకీయ వ్యభిచారులని విమర్శించారు. ఈడీ రైడ్స్ భయంతో మోదీ, అమిత్‌షా కాళ్లు మొక్కిన పొంగులేటి.. రేపు కాంగ్రెస్‌కు కూడా వెన్నుపోటు పొడవడం ఖాయమని ఆరోపించారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ లైనింగ్ పనుల్లో అత్యంత అవినీతిపరుడిగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కి ఆర్థికంగా బలపడి, ఈరోజు వాళ్లనే తిడుతున్నాడని అన్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ద్రోహం చేశాడని, గత 2018లో పాలేరులో తుమ్మలను, వైరాలో మదన్‌లాల్‌ను, కొత్తగూడెంలో జలగం వెంకట్రావ్‌ను ఓడించిన పాపం పొంగులేటిది కాదా అని ప్రశ్నించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తోంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వికృత భాషతో డ్రామాలు ఆడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారు’ అని ఎమ్మెల్సీలు విమర్శించారు. యాసంగి, వానకాలం రైతు భరోసా ఇవ్వకుండా రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500, తులం బంగారం వంటి ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా సీఎం రేవంత్ చిల్లర ఎత్తుగడలతో కాలం వెళ్లదీస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేళ్లలో రూ.పది లక్షల కోట్లు అప్పులు చేశారని ప్రతీ సభలో ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగ్, కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాలను కూడా పక్కనబెట్టి అబద్దాలను వల్లెవేస్తూ తెలంగాణ పరువును బజారున పడేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో విద్యుత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చామని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని, మిషన్ కాకతీయతో 48 వేల చెరువులను బాగుచేశామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందించామని, జిల్లాకో మెడికల్ కాలేజీని మంజూరు చేశామని, రోడ్లను నిర్మించామని వివరించారు. పల్లెలు, పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా నిలిపామన్నారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నరేండ్లలో రూ.4 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఎక్కడ తగలేసిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకోవడానికి ప్లాన్ వేశారని, దానికి అడ్డుపడినందుకు కేసీఆర్ కుటుంబం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరిన కాంగ్రెస్ మంత్రులు.. ఆ చర్చకు కేటీఆర్, హరీశ్‌రావు వస్తే చేతగాక పారిపోయారని విమర్శించారు. వారి తుపాకీ రాముడి ముచ్చట్లకు బెదిరిపోయేది లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌కు తగిన విధంగా గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.
మంత్రులా..? వీధి రౌడీలా..?
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే సమాధానాలు చెప్పాల్సిన మంత్రులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ సవాళ్లు విసురుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. ‘ఒక మంత్రి తెలంగాణ భవన్‌కు వస్తా అంటడు.. ఇంకో నలుగురు తెల్లవారకముందే అమరవీరుల స్తూపం దగ్గర ఫోజులిస్తారు.. తీరా చర్చకు బయలుదేరిన హరీశ్‌రావు, కేటీఆర్‌లను పోలీసులతో అరెస్టులు చేస్తారు.’ అంటూ ధ్వజమెత్తారు. వారి దగ్గర సరుకు లేకనే దొంగచాటు అరెస్టులని ఎద్దేవా చేశారు. సింగరేణి కుంభకోణం, గురుకులాల టెండర్ల గోల్మాల్, మూసీ, ఫ్యూచర్ సిటీ, లగచర్ల బాధితుల వంటి అనేక అంశాలకు సమాధానం చెప్పే ధైర్యంలేక ఫ్రస్టేషన్లో బూతులు తిడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత దాడులు, బాడీ షేమింగ్లు, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మంత్రులు గ్లాసుతో పోస్తే తాము బకెట్‌తో పోస్తామని హెచ్చరించారు. అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు సైతం వడ్డీతో సహా చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఆర్జేసీ (గుండాల) కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్, పగడాల నాగరాజు, బాషబోయిన వీరన్న, ఉప్పల వెంకటరమణ, బిచ్చాల తిరుమలరావు, షేక్ మక్బుల్, గుండ్లపల్లి శేషగిరిరావు, పగడాల నరేందర్, యలమద్ది రవి, బలుసు మురళీకృష్ణ, మంచానాయక్, మహ్మద్ రఫీ, మాటేటి కిరణ్‌కుమార్, షేక్ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.