వైరా, మార్చి 17: ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలందించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. వైరాలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ వేల్పుల పావని అధ్యక్షతన గురువారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలతో అర్హులకు లబ్ధి చేకూర్చే బాధ్యత అధికారులతోపాటు ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. సర్వసభ్య సమావేశాలు సాదాసీదాగా నిర్వహించడంలో అర్థం లేదని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకూ తాను హాజరవుతానన్నారు. ప్రతి సమావేశంలోనూ ఆయా సమస్యలపై చర్చిస్తామన్నారు. అంతకముందు సమావేశంలో చర్చించిన సమస్యలు మూడు నెలల తరువాత నిర్వహించే తదుపరి సమావేశంలోగా పరిష్కారం కావాలన్నారు. అధికారులు ఆ దిశలో పనిచేయకపోతే ఈ సమావేశాలకు అర్థం ఉండదన్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలుంటే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మార్క్‌ఫైడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీడీవో ఎన్.వెంకటపతిరాజు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు షేక్ లాల్‌మహ్మద్, ఏఎంసీ చైర్మన్ బీడీకే.రత్నం తదితరులు పాల్గొన్నారు.