దుమ్ముగూడెం, అక్టోబర్ 19: దుమ్మగూడెం మండలవాసి, పేదల వైద్యుడిగా సుపరిచితుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు ప్రజలు ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్సీ, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మహాదేవపురంలో బుధవారం నిర్వహించిన చర్చి పాస్టర్ల ఐక్యవేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతోనే ఏజెన్సీవాసులకు పోడు పట్టాలు అందాయన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం వచ్చిందన్నారు. నాటి ప్రభుత్వాల హయాంలో వందల్లో పింఛను వస్తే నేడు వేలాల్లో వస్తుందని కొనియాడారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, డయాలసిస్ బాధితులకు నెలనెలా ఠంచనుగా పింఛను అందుతున్నదన్నారు. తాజా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పింఛన్‌ను పెంచుతామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు.
నాటి పాలనలో భద్రాచలం నియోజకవర్గంలో పక్కనే గోదావరి వెళ్తున్నా, తాగేందుకు నీళ్లు దొరికేవి కాదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డల వివాహాలకు రూ.1,00,116 సొమ్ము అందుతున్నదన్నారు. ‘మన ఊరు- మన బడి’ పథకం ద్వారా ఏజెన్సీలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందన్నారు. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి బాట పట్టాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేయగా వాటిలో తెలంగాణకు చెందిన 18 గ్రామాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, కార్యదర్శి కణితి రాముడు, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీలు రేసు లక్ష్మి, కోదండరావు, ముఖ్యనాయకులు ఎండీ జానీపాషా, అరికెళ్ల తిరుపతిరావు, తాండ్ర వెంకటరమణ, గంపా రాంబాబు, నర్సింహారావు, మట్టా శివాజీ పాల్గొన్నారు.