మామిళ్లగూడెం, జూన్ 13 : ఖమ్మం నగరంలో లైంగిక దాడికి గురైన బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు కలెక్టర్ దివాకరకు శనివారం వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసిన వారు జిల్లాలోని పలు సమస్యల గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలికపై జరిగిన దురాఘతాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అండగా నిలవాలని కోరారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, తక్షణ ఆర్థిక సహాయం, మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు.
ప్రజోపకరమైన పనులను అడ్డుకోవడం సిగ్గుచేటు
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ప్రజలకు ఉపయోగపడే పనులను అడ్డుకోవడం సిగ్గు చేటని వారు అన్నారు. రైతులకు సకాలంలో యూరియా, విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని, పాస్ పుస్తకాలతో సంబంధం లేకుండా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ చైర్మన్లుగా సర్పంచ్‌లకు బాధ్యతలు ఇవ్వాలని కోరారు. సర్పంచ్‌లు లేని దగ్గర ప్రత్యేక అధికారులకు ఆ భాద్యతలు అప్పగించాలన్నారు. గృహలక్ష్మి లబ్ధిదారులను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో మంజూరైన ఇండ్లను లబ్ధిదారులు వివిధ స్థాయిలలో నిర్మించుకున్నారని, వారిని కూడా ఇందిరమ్మ పథకంలో చేర్చి ఇండ్లు పూర్తి చేసుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, పాల వెంకటరెడ్డి, బాషబోయిన వీరన్న, పోట్ల శ్రీనివాసరావు, డేరంగుల బ్రహ్మం, వెంకటరమణ, వెంకటేశ్వరరావు, రెంటాల ఆనంద్, లింగాల కృష్ణ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.