ఖమ్మం, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ విధివిధానాలతో గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని, పారదర్శకత, నిజాయితీ లేని సర్వేల కారణంగా అర్హులకు నష్టం జరుగుతున్నదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ధ్వజమెత్తారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, రైతుభరోసా పథకాల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా తప్పులతడకగా ఉందని విమర్శించారు.
అర్హులను ఎంపిక చేయకుండా అనర్హులను జాబితాలో పొందుపరచడం ద్వారా గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని చూస్తున్న ప్రజలు కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లు వేశామా అని బాధ పడుతున్నారని పేర్కొన్నారు. ఏ ఒక్క గ్రామసభ కూడా గొడవ లేకుండా లేదన్నారు. గ్రామసభల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టడం లేదని, ప్రజలే స్వయంగా ధర్నాలకు దిగుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుసుకోవాలన్నారు.
పొంగులేటి చేతనైతే వెంటనే రాజీనామా చేయాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో ప్రజలే తేలుస్తారని అన్నారు. పేదలకు ప్రభుత్వ ఫలాలు దక్కేవరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. ఈ నెల 26న తుది జాబితాను వెల్లడిస్తామన్న నాయకులు ఆ రోజు వరకు దరఖాస్తులు తీసుకుంటామని చెప్పడం వెనుక నిజాయితీ ఎంటో తెలుస్తుందని అన్నారు. గ్రామసభలను బహిష్కరించాలని బీఆర్ఎస్ ఎక్కడా పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, దొడ్డా శ్రీనివాసరావు, బెల్లం వేణు, పగడాల నాగరాజు, వీరమోహన్‌రెడ్డి, బాదావత్ బాలాజీ, బలుసు మురళీకృష్ణ, నరేందర్ పాల్గొన్నారు.