ఖమ్మం, డిసెంబర్ 9: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రజాప్రతినిధులను అరెస్టు చేసిన విధానం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించి అసెంబ్లీకి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రానివ్వకుండా అడ్డుపడి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న నిరంకుశ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అంటూ ఆమరణ దీక్ష చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతూ, మరోవైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ కార్యకర్తల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అభయహస్తం మ్యానిఫెస్టో పేజీ నెంబర్ 26లో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ అమలు చేయాలంటూ ఆశ అకాచెల్లెళ్లు రోడ్డెకితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గమని అన్నారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశ కార్యకర్తలకు నిరసన తెలిపే హకు లేదా? సమస్యలు పరిషరించాలని అడిగే స్వేచ్ఛ లేదా?’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.