ఖమ్మం కమాన్‌బజార్, అక్టోబర్ 8: స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చూపాలని, కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అందుకోసం స్థానికంగా బలంగా ఉన్న ఏ పార్టీతోనైనా పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలని ఉపదేశించారు. స్ధానిక ఎన్నికల సందర్భంగా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన పార్టీ ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతప్తి, వ్యతిరేకత తీవ్రంగా ఉన్నాయని అన్నారు.
వాటినే ఎన్నికల అస్ర్తాలుగా అందిపుచ్చుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల నాటి హామీలైన రూ.4 వేల పింఛన్, రూ. 2 లక్షల రుణమాఫీ, తులం బంగారం వంటి పథకాలు ఎక్కడా అమలుకావడం లేదని స్పష్టం చేశారు. గ్యారెంటీ కార్డులన్నీ బాకీ కార్డులుగా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. ఈ బాకీ కార్డులను ప్రతి ఇంట్లోనూ చూపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో మంత్రులు, అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
జిల్లాకు అధికారికంగా ఉన్నది ముగ్గురు మంత్రులే అయినప్పటికీ తుంబూరు దయాకర్‌రెడ్డి, మల్లు నందిని షాడో మంత్రులుగా చలామణీ అవుతున్నారని తాతా మధు విమర్శించారు. వీరిద్దరి చేత్తుల్లోనే జిల్లా అధికారులు పనిచేస్తున్నారని, జిల్లా పాలనా వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసేవారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగని వారిని, కేసులకు భయపడని వారిని మాత్రమే పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని సూచించారు.
అక్రమ కేసులకు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని, వారికి పార్టీ లీగల్ సెల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను అత్యధిక సంఖ్యలో గెలిపించాలని కోరారు. ఇందుకోసం అందరమూ ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరైన ఈ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, బానోత్ చంద్రావతి, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, పార్టీ నాయకులు ఉప్పల వెంకటరమణ, బమ్మెర రామ్మూర్తి, పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమలరావు, బెల్లం వేణు, బానోత్ మంజుల, కట్టా అజయ్‌కుమార్, గిరిబాబు, కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. గ్రామ రాజకీయాలను శాసించే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, నాయకులకు ఆక్సీజన్ లాంటివని అన్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో 432 హమీలిచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని అమలుచేయడంలో విఫలమైందని విమర్శించారు.
పైగా, ప్రతిపక్ష నాయకులపైనా, పాత్రికేయులపైనా అక్రమ కేసులు పెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ ముఖ్య నేతలైన కేటీఆర్, హరీశ్‌రావులపై కూడా అక్రమ కేసులు బనాయించారని వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో పట్టణ నేతల సహకారం తీసుకోవాలని సూచించారు. అందరూ కలిసి సమన్వయంతో పని చేసి ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.