ఖమ్మం, మార్చి 25:గత ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ల కృషి, సహకారం వల్లనే ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఖమ్మం నగర పాలక సంస్థ (కేఎంసీ) కార్యాలయంలో మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఖమ్మం పట్టణ రూపురేఖలు మారిపోయాయని గుర్తుచేశారు. ప్రతి డివిజన్లో జరిగే అభివృద్ధి పనుల సమాచారం సంబంధిత ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా అందించాలని కోరారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.188.31 కోట్లతో కేఎంసీ బడ్జెట్ ఆమోదం పొందినట్లు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలు, ఆదాయం, ఖర్చుల వివరాలు, 2024-25 సవరించిన బడ్జెట్ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేఎంసీలో ఆస్తి పన్ను, ఇతర పన్నులు రీ అసెస్మెంట్ చేసి ఆదాయ మార్గాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఆస్తి పన్ను సడలింపునిచ్చి పాలకవర్గం మంచి నిర్ణయం తీసుకుందని కలెక్టర్ అభినందించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా కూడా కేఎంసీకి ఆదాయం వస్తుందని, దానిని సక్రమంగా వినియోగించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. టౌన్ ప్లానింగ్, అద్దెలు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయ మార్గాలు పెంచుకోవాలని సూచించారు. అలాగే, గతంకంటే ఇప్పుడు 25 శాతం ఆదాయం పెరిగిందని అన్నారు.
ప్రజాప్రతినిధుల పట్ల కేఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీకి గౌరవం లేకుండా తన సీటు ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై మండిపడ్డారు.
సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ.. విలీన పంచాయతీల అభివృద్ధిపై దృష్టిసారించామని, విలీన పంచాయతీలకే వార్డు బడ్జెట్ అధికంగా కేటాయించామని అన్నారు. ఆ నిధులను ఆ పంచాయతీల అభివృద్ధికే ఖర్చు చేస్తామని అన్నారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ముందుగా 43వ వార్డులో పన్నుల రీ అసెస్మెంట్ చేయడం ద్వారా రూ.60 లక్షల వరకు ఆదాయం పెరిగిందని అన్నారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, కాంగ్రెస్ కార్పొరేటర్ కమర్తపు మురళి తదితరులు మాట్లాడారు. అదనపు కలెక్టర్ శ్రీజ, కేఎంసీ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.