ఖమ్మం, ఫిబ్రవరి 13: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం ఖమ్మం రానున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిన నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు, తెలంగాణ జాగృతి సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
అయితే ఈ సమావేశానికి కవిత హాజరుకానున్నారు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని సప్తపది ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో ఆమె ప్రసంగిస్తారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తారు. బీఆర్ఎస్ నేత, ఎస్బీఐటీ కళాశాల అధినేత ఆర్జేసీ కృష్ణ ఇంట్లో సాయంత్రం తేనీటి విందు స్వీకరిస్తారు. కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, జాగృతి బాధ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.