ఖమ్మం, మే 17 : బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ఆశీస్సులతో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే శాసనమండలిలో ప్రజా గొంతుకనై ప్రశ్నిస్తానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి రాకేశ్‌రెడ్డి నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్బంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, రాజు, రామచందర్‌రావు, డాక్టర్ నాగేశ్వరరావు, దిలీప్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి మేధావులు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఈసారి కూడా అదే పరంపర కొనసాగుతుందని భావిస్తున్నానన్నారు. తాను బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఏడేళ్లు అమె
రికాలో ఉండి కన్న భూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో 2013లో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనకు అందరి సమస్యలపై అవగాహన ఉన్నదని, అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతానని అన్నారు. తనను గెలిపిస్తే ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన వారి గొంతుకలా పోరాడుతానని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ జిల్లా ఓటర్లు, ప్రజలు చాలా చైతన్యవంతులని, పట్టభద్రల నియోజకవర్గంలోని ఓటర్లు అందరూ విజ్ఞతతో ఆలోచించి అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్ అని, అతడికి ఓటు వేయడం వ్యర్థమని అన్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు, అనేక జిల్లాలకు చెందిన రియల్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే మండలి పరువు పోతుందన్నారు.
అనంతరం స్టేడియంలోని జిమ్‌లో జిమ్ చేసి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సమన్వయకర్తలు ఆర్జేసీ కృష్ణ, బిచ్చాల తిరుమలరావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, మోతారపు సుధాకర్, కార్పొరేటర్ బుడిగెం శ్రీను, శీలంశెట్టి వీరభద్రం, మేకల సుగుణారావు పాల్గొన్నారు.