ఖమ్మం, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మీలో ఒకడిగా, మీ అందరి ప్రతినిధిగా ఉంటూ మీ గళాన్ని శాసన మండలిలో వినిపించడానికి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి కోరారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు. అధికార పార్టీకి ఒత్తాసు పలికే తీన్మార్ మల్లన్నకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణభవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఆయన మాట్లాడారు.
పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమైనదని అన్నారు. విద్యావంతులు, మేధావులంతా కలిసి సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారని అన్నారు. అందుకని ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని ఆదరించాలని, ప్రశ్నించేవారిని తిరస్కరించాలని కోరారు. తనది ప్రశ్నించే గొంతుక అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న.. నిరుద్యోగభృతి, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ వంటి వాటిపై ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఈసారి కూడా గులాబీ జెండా ఎగరబోతోందని స్పష్టం చేశారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. సామాజిక సేవాగుణం ఉండి రాజకీయాల్లోకి వచ్చిన మంచి వ్యక్తి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అని అన్నారు. ఇలాంటి వ్యక్తికే చట్టసభల్లో కూర్చునే అర్హత ఉందని అన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, విద్యావంతులు విజ్ఞతతో ఆలోచించాలని.. హకుల కోసం పోరాడే రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అమెరికాలో పనిచేస్తున్న ఆయన.. దేశానికి సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు.
కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి బీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. తెలంగాణ సమాజానికి పట్టిన చీడపురుగుల్లో ఒక పురుగు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అని విమర్శించారు. చైతన్యవంతులైన ఖమ్మం జిలా ప్రజలు ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మల్లన్నను ఓడించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బిచ్చాల తిరుమలరావు, పగడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం, ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, ముత్యాల వెంకట అప్పారావు, సతీశ్, ఆసిఫ్ హైమద్ సయ్యద్, బురఖాన్ తదితరులు పాల్గొన్నారు.