కొత్తగూడెం అర్బన్, నవంబర్ 5 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయం కోసం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ భారీ సక్సెస్ అయింది. టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్య అతిథి సీఎం కేసీఆర్ ప్రసంగం అందరినీ ఆలోజింపజేసింది. తెలంగాణ ఏర్పడకముందు కొత్తగూడెం ప్రాంతం ఏ తవిధంగా ఉందో, రాష్ట్రం వచ్చాక నియోజకవర్గం ఏయే రంగాల్లో ఎంత పురోగభివృద్ధి సాధించిందో అంకెలతో సహా చెప్పడంతో సభికులు ఎంతో ఆసక్తిగా విన్నారు. సింగరేణి ఎంత గణనీయమైన అభివృద్ధిని సాధించిందో చెప్పడాన్ని ప్రజలు సావధానంగా ఆలకించారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి కంపెనీకి, ఈ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని, వారు చేసిన అన్యాయాన్ని వివరించారు. దీంతో సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అంశాలపై సభ అనంతరం చర్చించడం విశేషం.
తమ అభిమాన నాయకుడు, రాష్ట్ర రథసారథి కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రకాశం స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం పది గంటల నుంచే ఆయన కోసం ఎదురుచూశారు. డప్పు వాయిద్యాల నడుమ పల్లె, పట్టణ ప్రాంతాల నుంచి ప్రజలు రావడంతో కొత్తగూడెంలోని సూపర్‌బజార్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్, పోస్టాఫీస్ సెంటర్, హెడ్డాఫీస్ సెంటర్, విద్యానగర్ తదితర ఏరియాల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ పాటలతో యువతీ యువకులు, మహిళలు కేరింతలు కొడుతూ రోడ్లపై నృత్యాలు చేశారు. బంజారా నృత్యాలు, బ్యాండ్ మేళాలతో కొత్తగూడెంలో మార్మోగిపోయింది. డీజే సౌండ్‌తో తెలంగాణ పాటలు హోరెత్తించాయి. అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలోనే జనం రావడం టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నిండింది. సీఎం కేసీఆర్ వేదికపైకి చేరుకోగానే తెలంగాణ ఉద్యమకారుడు హుస్సేన్ కేసీఆర్ చేతికి దట్టి కట్టి ఆశీర్వచనం తీసుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను వెంట తీసుకొచ్చి సీఎం కేసీఆర్‌ను చూపించడంతో పిల్లలు సంబురపడ్డారు.
తెలంగాణ అంటేనే ఆటాపాట. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధూంధాం కార్యక్రమం సభికులలతో హుషారెత్తించింది. గాయని మధుప్రియ పాడిన పాటలకు యువకులు గులాబీ జెండాలు చేతపట్టి జోష్ నింపారు. మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు శాంతి, సోన, కౌన్సిలర్లు పాదం కలుపుతూ ఆడి పాడారు. కార్యకర్తలు సిటీ కొడుతూ సందడి చేశారు.
బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు ఎవరూ ఊహించని రీతిలో జనం హాజరయ్యారు. దీంతో సభ సూపర్ సక్సెస్ అయింది. అధిక సంఖ్యలో జనం వచ్చినప్పటికీ అందరికీ దాహార్తిని తీర్చేందుకు మంచినీళ్లు, మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లు బాగున్నాయంటూ వద్దిరాజు రవిచంద్రను సీఎం కేసీఆర్ అభినందించారు. సభకు కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థులు వనమా వెంకటేశ్వరరావు, తెల్లం వెంకట్రావ్, రేగా కాంతారావు, హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావులతోపాటు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, టీబీజీకేఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రావు, దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, కోనేరు సత్యనారాయణ (చిన్ని),జేవీఎస్ చౌదరి, బాదావత్ శాంతి, భూక్యా సోన, బీ.వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, తొగరు రాజశేఖర్, మోరె భాస్కర్, బండి రాజుగౌడ్, హుస్సేన్, గూడెల్లి యాకయ్య, ఎస్కే ఇమ్రాన్, గుంపుల మహేశ్, మంతపూరి రాజుగౌడ్, మధుసూదన్, రాము పాల్గొన్నారు.
రామవరం/ చుంచుపల్లి/ పాల్వంచ, నవంబర్ 5 : కొత్తగూడెంలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు సింగరేణి కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ ఆధ్వర్యంలో అధికసంఖ్యలో కార్మికులు కదం తొక్కారు. ర్యాలీగా రామవరం నుంచి సభా ప్రాంగణం వరకు జయహో కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రామవరం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కౌన్సిలర్ మోరె రూపా ఆధ్వర్యంలో బారీగా జనాన్ని తరలించారు. బీఆర్ఎస్ చుంచుపల్లి మండల అధ్యక్షుడు అబ్దుల్ ఉమర్ ఆధ్వర్యంలో సుమారు 10వేల మందితో సభాప్రాంగణానికి చేరుకున్నారు. పాల్వంచలోని నెహ్రూనగర్ 14వ వార్డు, పాల్వంచలోని దమ్మపేట సెంటర్ నుంచి, ఇందిరాకాలనీ, పాల్వంచ లక్ష్మీదేవిపల్లి నుంచి, పాల్వంచ ఇందిరా కాలనీ నుంచి వివిధ వాహనాల్లో సభకు తరలివెళ్లారు.