కారేపల్లి, ఏప్రిల్ 1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మంగళవారం ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అన్నారు.
ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. అందరి సహకారంతో ఈ పథకం నిర్వహణ అమలును ప్రభుత్వం సజావుగా కొనసాగిస్తుందన్నారు. బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.