తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 14 : కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రభుత్వ రంగాల్లో, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కష్టాలు పరిపాటిగా మారాయి. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ కనబర్చకపోవడంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, క్యాజువల్ లేబర్లకు ఆయా ఏజెన్సీ కంపెనీలు నెలల తరబడి వేతనాలు చెల్లిండం లేదు. నాలుగు నెలలుగా వేతనాలు రాక ఖమ్మం జిల్లాలోని మిషన్ భగీరథ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ కాంట్రాక్టు ఏజెన్సీ కంపెనీలకు నెలల తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టడం, దీంతో వారు కూడా భగీరథ కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వంటివి పరిపాటిగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన ఈ 21 నెలల్లో మిషన్ భగీరథ కార్మికులు ఇప్పటికే మూడు దఫాలుగా సమ్మె చేశారు. నాలుగైదు నెలలపాటు వేతనాలు చెల్లించపోవడంతో వారు సమ్మెకు దిగుతున్నారు. అలా సమ్మె చేసిన కొద్ది రోజులకు ఒకటీ రెండు నెలల వేతనాలు ఇవ్వడం, ఆ తరువాత మళ్లీ వేతనాలు పెండింగ్ పెట్టడం వంటివి పరిపాటిగా మారుతున్నాయి.
తమ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత నెల చివరి వారంలో కూడా జిల్లాలోని మిషన్ భగీరథ కార్మికులు సమ్మె చేశారు. వేతనాలు జమ చేసేలా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు ఇచ్చిన హామీని నమ్మిన కార్మికులు సమ్మెకు విరామమిచ్చి విధుల్లోకి వెళ్లారు. సెప్టెంబర్ నెల మధ్యలోకి వచ్చినా ఇంకా వేతనాలు రాలేదు. దీంతో కార్మికులు మళ్లీ సమ్మెకు సమాయత్తమయ్యారు.
ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ పథకం నిర్వహణలో 450 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ వచ్చే చాలీచాలని వేతనంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. నాలుగు నెలలుగా జీతాలు రాకపోయినా.. తరువాతైనా వస్తాయన్న నమ్మకంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రోజువారీ బైక్ పెట్రోల్ ఖర్చులకు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పెండింగ్ వేతనాల మంజూరు కోసం గత నెల 22న కార్మికులు జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ ప్లాంట్ల వద్ద సమ్మె చేసిన విషయమం విదితమే. జిల్లా వ్యాప్తంగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు.. కార్మికులతోనూ, కార్మిక సంఘాల నాయకులతోనూ చర్చించారు. సెప్టెంబర్ 15లోపు నాలుగు నెలల జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి వెళ్లారు.
ఈలోపు సెప్టెంబర్ 14వ తేదీ వచ్చినా అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు వేతనాలు జమకాలేదు. అధికారుల హామీ నీటమూటైంది. దీంతో ఈ నెల 15వ తేది రాత్రి నుంచి నీటి సరఫరా మోటర్లను నిలిపివేసి మళ్లీ సమ్మెకు దిగనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. మళ్లీ సమ్మె చేస్తే తప్ప తమకు వేతనాలు వచ్చే పరిస్థితి లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. 2008 నుంచి ఓ సీపీడబ్ల్యూఎస్ స్కీంలో పనిచేస్తున్న 450 కార్మికులను తెలంగాణ తొలి ప్రభుత్వం 2018లో చేపట్టిన మిషన్ భగీరథ పథకంలోకి తీసుకొచ్చింది.
తొలి ప్రభుత్వమైన బీఆర్ఎస్ పాలనలో ఈ కార్మికులకు ఎలాంటి కష్టాలూ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మిషన్ భగీరథ కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. కార్మిక చట్టాల ప్రకారం సరైన విధివిధానాలు లేకుండా ఈ ప్రభుత్వం పలు ఏజెన్సీలను పురమాయించి వాటి కింద ఈ కార్మికులతో పనులు చేయిస్తూ ఆయా ఏజెన్సీల ద్వారానే వేతనాలు చెల్లిస్తోంది. ఆయా ఏజెన్సీలకు కూడా సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా ఏజెన్సీలు కూడా కార్మికులకు నెలల తరబడి వేతనాలు జమ చేయడం లేదు. పైగా కార్మికులతో శ్రమ దోపిడీ చేయించుకుంటున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు ఏజెన్సీలకు అగ్రిమెంటు కూడా జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతోపాటు అగ్రిమెంటు కూడా జరగకపోవడంతో తమకు వేతనాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు జోక్యం చేసుకొని తమ వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
మిషన్ భగీరథ కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా మా కార్మికులను ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోంది. సమ్మె చేస్తే తప్ప ఒక నెల వేతనం కూడా రాని పరిస్థితి నెలకొంది. కార్మిక చట్టాల ప్రకారం శ్రమకు తగిన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. గత నెలలో సమ్మె చేస్తే ఈ నెల 15లోపు నాలుగు నెలల వేతనాలు చెల్లిస్తామని జిల్లాస్థాయి అధికారులు హామీ ఇచ్చారు. 14వ తేదీ వచ్చినా వేతనాలు జమకాకపోవడంతో అధికారుల హామీ కూడా నెరవేరలేదు. దీంతో సోమవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కార్మికులందరమూ మళ్లీ సమ్మెకు దిగాలని నిర్ణయించాం.
– జక్కుల యాదగిరి, మిషన్ భగీరథ కార్మికుడు