కారేపల్లి, నవంబర్ 12 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇంటింటికి కుళాయిల ద్వారా శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందజేసేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని గ్రామాలకు పైప్లైన్లను వేసి గోదావరి జలాలను ప్రజల చెంతకు తరలించి దాహార్తిని తీర్చింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. అయితే గత రెండేళ్లుగా మిషన్ భగీరథ పథకాన్ని సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో దుర్వినియోగం అవుతుంది. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన ఈ పథకం నీళ్లు మురికి కాల్వలోకి నిరుపయోగంగా పోతున్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ప్రధాన దారి వెంట ఖాళీ ఇండ్ల జాగాలకు మిషన్ భగీరథ పైప్ కలెక్షన్లు ఇచ్చారు. వాటికి ఎటువంటి నల్లాలు బిగించకపోగా యజమానులు మురికి కాల్వలోకి వదిలేశారు. దీంతో శుద్ధమైన నీళ్లన్నీ మురికి కాల్వల ద్వారా చెరువులోకి పారుతున్నాయి.
ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ తాగునీటి కులాయి పైపులను సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది నిత్యం చూస్తూ తమకేమీ పట్టనట్లు వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓవైపు గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే మిషన్ భగీరథ పైపుల ద్వారా వచ్చే శుద్ధమైన నీళ్లని ఇలా వృథాగా వదిలేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్రావును నమస్తే తెలంగాణ వివరణ అడగగా.. ఖాళీ ఇండ్ల ప్లాట్ల యజమానులు నల్ల కలెక్షన్లు కావాలని దరఖాస్తులు చేసుకుంటే ఇచ్చామన్నారు. మిషన్ భగీరథ పైపుల ద్వారా సరఫరా అయ్యే శుద్ధమైన తాగునీటిని వృథాగా వదిలేస్తే నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులు పగిలి, లీకై తాగునీరు కలుషితమవుతుందని సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బందిపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆర్డబ్ల్యూఎస్, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.