చర్ల, మే 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వెంకటచెర్వులో నివసిస్తున్న ఆదివాసీలకు వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని అడవిలో తోగుల వద్ద నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. నీరు కలుషితం కాకుండా ఉండేందుకు తూరలు వేసి బావిలాగా చేసుకున్నారు. అందులో ఊరిన నీటిని రోజూ తోడుకుని తెచ్చుకొని తాగుతున్నారు. గత మూడునెలల నుంచి తోగునీటినే తాగునీటి కోసం వాడుకుంటున్నారు. సుమారు 50 కుటుంబాలున్న వెంకటచెర్వు గ్రామంలో 200 వందలకు పైగానే ఓటుహక్కు కలిగినవారున్నారు. 50 ఏళ్లకు పూర్వం ఛత్తీస్గఢ్ నుంచి వివిధ కారణాల వల్ల ఈ ప్రాంతానికి వలసొచ్చి చర్లకు 5 కిలోమీటర్ల దూరంలోని అడవిలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఈ వెంకటచెర్వు గ్రామంలో తాగునీటి కోసం గత పాలకులు మొత్తం నాలుగు బోర్లు వేయించారు. గ్రామంలో ఉన్న బోర్లన్నింటిలో బకెట్ నీళ్లు వస్తే తర్వాత గాలి వస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ గ్రామానికి భగీరథ నీటిని సరఫరా చేసేందుకు పైపులైన్లు వేయించింది. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో భగీరథ నీరు ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా జరిగింది.. కానీ.. ప్రస్తుతం గడిచిన 5 నెలల నుంచి భగీరథ పైపుల నుంచి నీరు రావడంలేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా మిషన్ భగీరథ గురించి పట్టించుకోలేదని తమ బాధను వెల్లడిస్తున్నారు.