రఘునాథపాలెం, మార్చి 21: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ‘ఎర్ర బంగారం’ ధర రోజురోజుకూ పతనమవుతున్నది. ఒకానొక దశలో రూ.14 వేలకు చేరిన మిర్చి క్వింటా ధర.. గత 4 రోజుల్లోనే రూ.500 తగ్గింది. నిరుడు ఇదే సమయంలో రూ.23 వేలు ఉన్న మిర్చి ధర ఇప్పుడు సగం ధర మాత్రమే పలుకుతోంది. అందుకు ప్రధాన కారణం మార్కెట్లో తిష్టేసిన దళారులేనని స్పష్టమవుతోంది.
నిరుడు మిర్చి ధర మార్కెట్లో రూ.20 వేల పైచిలుకు ధర పలికినప్పటికీ వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటా మిర్చి రూ.30 వేలకు చేరుతుందనే ఆశతో పెద్దఎత్తున వ్యాపారులంతా రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. అయితే మార్కెట్ వ్యాపారుల ఆశలు అడియాశలయ్యాయి. రైతుల వద్ద నుంచి వ్యాపారుల చేతికి పంట వచ్చినంక మిర్చి ధర పూర్తిగా తగ్గిపోయింది.
దీంతో వ్యాపారులు చేసేది లేక.. గోదాముల్లో నిల్వ చేసుకోలేక అగ్గువకు అమ్ముకున్నారు. అయితే నిరుటి నష్టాన్ని పూడ్చుకునే ఆలోచన చేసి ఈ ఏడాది వ్యాపారులంతా సిండికేట్ అయ్యారనే ఆరోపణలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. ఫలితంగా మిర్చి ధర క్వింటా రూ.13,500 వద్దనే ఆగిపోయింది. మొదట రూ.14,300 వరకు చేరినప్పటికీ ఆ తరువాత రోజురోజుకూ తగ్గుముఖం పడుతూ వచ్చింది. చివరకు నాణ్యమైన మిర్చి ధర మాత్రం గరిష్టంగా రూ.13,500 చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇక తేమశాతం, నలుపురంగు పేరుతో వ్యాపారులు చెప్పిందే రేటుగా కొనసాగుతోంది.