రఘునాథపాలెం, ఆగస్టు 1: రఘునాథపాలెం మండలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్వామి నారాయణ ట్రస్ట్ గురుకుల విద్యాలయం ఏర్పాటు కానుంది. గురుకుల విద్యాలయం వేదికగా కేజీ నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం స్వామి నారాయణ ట్రస్ట్‌కు 13.07 ఎకరాలను మార్కెట్ ధరకు కేటాయించింది.
ఈ మేరకు భూమిని కేటాయించినందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ విద్యాసంస్థలకన్నా తక్కువ ఫీజులతోనే సీబీఎస్ఈ సిలబస్‌తో విద్యాలయం కొలువుదీరబోతున్నట్లు మంత్రి గురువారం తెలిపారు. స్వామి నారాయణ ట్రస్ట్ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటుందన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతోపాటు చుట్ట్టు పక్కల జిల్లాలకు చెందిన 500 మంది విద్యార్ధులకు విలువలతో కూడిన విద్య అందుతుందని అభిప్రాయపడ్డారు.
దేశ వ్యాప్తంగా 58 గురుకుల విద్యాసంస్థలను స్థాపించడంతోపాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో గురుకులాలను ఏర్పాటు చేసి అత్యున్నత ప్రమాణాలతో చక్కని వసతి, భోజన సదుపాయాలతో విద్యను అందిస్తున్నట్లు వివరించారు. జాతీయస్థాయి విద్యారంగంలో అనేక అవార్డులను పొందిన స్వామి నారాయణ ట్రస్ట్ గురుకుల విద్యాలయం ఖమ్మం జిల్లాకు రానుండడం భావి విద్యార్థుల వరంగా అభివర్ణించారు. గురుకుల విద్యాలయం రాకతో ఉద్యోగ అవకాశాలూ లభిస్తాయన్నారు.