బూర్గంపహాడ్ (భద్రాచలం), సెప్టెంబర్ 11 : ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని, పరిహారం అందించడానికి ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో వరద నష్టం వివరాలను శాఖలవారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిల భవనాలను ఎక్కడికక్కడ తొలగించాలని, పంటలు మునిగితే శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
భద్రాచలం డివిజన్లో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయాలని, వరదలతో 14 గ్రామాల్లో పాడైపోయిన రోడ్లకు ప్రతిపాదనలు పంపించాలని, అన్ని మండలాల్లో కల్వర్టులు, బ్రిడ్జిల ఫొటోలు చేయించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్యులు ముంపు ప్రాంతాల్లోనే కాక అన్ని పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, ఆర్డీవో దామోదర్‌రావు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.
ముందు జాగ్రత్తలతోనే గోదావరి వరదలతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో రూ.40 కోట్లతో కొత్త కరకట్ట నిర్మాణంతో భద్రాచలం పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో వరద ముంపు జరగకుండా చేశామన్నారు. మణుగూరు, ఖమ్మం మండలాల్లో ఎక్కువ శాతం ఆస్తి నష్టం జరిగిందని, ఇండ్లు మునిగిపోయాయని, నీట మునిగిన పొలాలకు ఎకరాకు రూ.10 వేలు తక్షణ సాయం అందించామని, 2 వేల ఇండ్లు ముంపునకు గురికావడంతో ప్రతి ఇంటికి రూ.16,500 చొప్పున సహాయం అందించనున్నట్లు చెప్పారు.
దేవస్థాన భూములను సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. భక్తులకు దుర్గంధం వెదజల్లకుండా పరిసరాలతోపాటు పట్టణ వీధుల్లో చెత్తాచెదారం వేయకుండా పంచాయతీ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలన్నారు. తొలుత గోదావరి వరద ఉధృతితోపాటు కరకట్ట నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మోటర్లను పరిశీలించి సూచనలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే తెల్లంతోపాటు కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.