ఖమ్మం, ఆగస్టు 8: ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిలా పర్యటన నిమిత్తం ఖమ్మానికి వచ్చిన రాష్ట్ర హౌసింగ్ శాఖ కమిషనర్, స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమ జిల్లా స్పెషలాఫీసర్ వీపీ గౌతమ్, ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కేఎంసీ కమిషనర్ అభిషేక్.. ఖమ్మం లో మంత్రి తుమ్మలను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను సంరక్షించాలని ఆదేశించారు. వాటిని ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. ఖమ్మం నగరంతోపాటు రఘునాథపాలెం మండలంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. వాటికి ఫెన్సింగ్ వేసి బందోబస్తు చేయాలని ఆదేశించారు. గోళ్లపాడు ఛానెల్ పెండింగ్ పనులు నాణ్యత ప్రకారం పూర్తి చేయాలన్నారు.
వెలుగుమట్ల అర్బన్ పారును ఎకో టూరిజం పారుగా చేయాలన్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో ఖమ్మం నగరాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఖమ్మంలో మరో ఇంటర్నేషనల్ సూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సైతం చూడాలని ఆదేశించారు. ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని కోరారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, అధికారులు పాల్గొన్నారు.