ఖమ్మం, నవంబర్ 4:సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం నగరంలో సోమవారం పర్యటించిన ఆయన.. 18వ డివిజన్ శ్రీరామ్‌నగర్‌లో 1.75 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
రోడ్డు వెడల్పును వర్ ఆర్డర్ ప్రకారం చేపట్టాలని, పనుల నాణ్యతలో ఎకడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా డ్రెయిన్లపై షాపులు, ఆక్రమణలు చేపట్టవద్దని సూచించారు. నదుల్లో ఇళ్ల నిర్మాణాలు; కాల్వలు, చెరువు అలుగుల ఆక్రమణలతో ప్రజలకు కష్టాలు వచ్చాయని, మొన్నటి మున్నేరు వరదలకూ ఇవే కారణమని అన్నారు.
అలాగే, నగరంలో ఖాళీ ప్లాట్లలో పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరబోవని అన్నారు. పరిశుభ్రత పాటించడాన్ని ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రాయల నాగేశ్వరరావు, పునుకొల్లు నీరజ, డాక్టర్ శ్రీజ, మందడపు లక్ష్మీ మనోహర్, కమర్తపు మురళి, మేడారపు వెంకటేశ్వర్లు, రంజిత్, కృష్ణలాల్ తదితరులు పాల్గొన్నారు.