ఖమ్మం, అక్టోబర్ 5: ఖమ్మం నగరం పరిశుభ్రంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాపర్తినగర్ 58వ డివిజన్లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.1.10 కోట్లతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రెయిన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.
58వ డివిజన్ పెద్ద డివిజన్ అని, కొత్త కాలనీలు, ఇంటి నిర్మాణాలు వస్తున్నందున అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఖమ్మం నగర అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్ కమర్తపు మురళి, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సీహెచ్ స్వామి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.