ఖమ్మం, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాథేయపడ్డారు.
కష్టాల్లో ఉన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలని రైతులు పుట్టెడు కష్టంలో ఉన్నారని కేంద్రమంత్రికి శోకతప్త హృదయంతో విన్నవించాడు. వరదల వల్ల ఖమ్మం జిల్లాలో జరిగిన అపార వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడానికి శుక్రవారం వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కూసుమంచి మండలం పాలేరు నవోదయ పాఠశాలలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతుల నుంచి ఇబ్బందులు చెప్పాలని కేంద్ర వ్యవసాయమంత్రి కోరగానే కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్రమంత్రి చౌహాన్‌కు అర్థమయ్యేలా హిందీలో వివరించారు. ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని నర్సింహారావు ఒక్కసారిగా వేదికమీదకు వెళ్లి శివరాజ్‌చౌహాన్ కాళ్లపై పడ్డారు.