ఖమ్మం, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “మతి భ్రమించే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నగరంలో మేం ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇసుక దందా చేయడానికి ఇక్కడేమైనా గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయా..? నగర పరిధిలో ఉన్న నది మున్నేరు. నది నిండా రాళ్లే ఉంటాయి. ఇసుక జాడే ఉండదు. ఆదివారం సీఎం కేసీఆర్ ప్రసంగించనున్న నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలోని చిన్న స్టేజీ తొలగింపుపై రాద్ధాంతం చేస్తున్నారు. కేవలం సీఎం భద్రతా దృష్ట్యానే స్టేజీని తొలగించాల్సి వచ్చింది. సభ పూర్తయిన తర్వాత స్టేజీని దగ్గరుండి తిరిగి నిర్మిస్తాం. నిర్మాణానికి ఇప్పటికే కళాశాల బ్యాంక్ ఖాతాలో రూ.లక్ష జమ చేశాం..” అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మల బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశమే నాశనమైందన్నారు. ముందు ఆ విషయాన్ని తుమ్మల అర్థం చేసుకోవాలన్నారు. ఖమ్మంలో మతి భ్రమించి మాట్లాడేవాళ్ల సంఖ్య ఎక్కువ అవుతుందని, వారికి కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు.
ఈ నెల 30న ప్రజలే ఆయనకు ఓట్లతో బుద్ధి చెప్తారన్నారు. సీఎం సీభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలలోపు సభ ముగుస్తుందన్నారు. ప్రజలు ముందుగానే సభ స్థలికి చేరుకోవాలని సూచించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సమయంలోనే ప్రజల మధ్యకు వస్తారన్నారు. తర్వాత వాళ్ల ఉనికి కూడా ఉండదన్నారు. వాళ్లది అధికార దాహం తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంటే అసలు కేంద్రంలో మత విద్వేషాలు సృష్టించే బీజేపీ కేంద్రంలో ఎందుకు అధికారంలో ఉంటుందని ప్రశ్నించారు. ఖమ్మంలో జరిగే సీఎం సభకు ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తనపై లేనిపోని ప్రచారానికి దిగితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తన ప్రయాణం బీఆర్ఎస్తోనే ఉంటుందన్నారు. డిప్యూటీ నగర మేయర్ ఫాతిమా జోహారా మాట్లాడుతూ.. మంత్రి అజయ్‌కుమార్ కృషితోనే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ శ్వేత, పార్టీ సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు కర్నాటి కృష్ణ, జహీర్‌అలీ, చింతనిప్పు కృష్ణచైతన్య, బోయినపల్లి కృష్ణమూర్తి పాల్గొన్నారు.