ఖమ్మం, జూలై 26: ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అధికార యంత్రాంగం అప్రమత్తంగానే ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మున్నేరు వరదల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేని అన్నారు. మరో రెండు రోజులపాటు వచ్చే వర్షాలు, వరదల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా సమర్థంగా ఎదురొనేలా అధికారులను సమాయత్తం చేశామన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తమ కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. అవసరమైతే సెలవులో ఉన్న వారు కూడా వాటిని రద్దు చేసుకొని విధులకు హాజరై సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే, జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి కలెక్టర్ వీపీ గౌతమ్‌ను అడిగి తెలుసుకున్నారు.
పరిస్థితిని అంచనా వేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వరద ప్రభావంతో వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయాల్లోని కంట్రోల్ రూములకు వచ్చిన కాల్స్‌పై వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పురాతన ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వారికి భోజన వసతి సహా ఇతర సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. ఖమ్మం నగరంలో ఎవరైనా ఎకడైనా ప్రమాదంలో చికుకుంటే తక్షణమే కేఎంసీలోని 7901298265, 9866492029 అనే టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.