‘ప్రణబ్‌జీ నా లక్ష్యం ఏంటో మీకు తెలుసు. శాఖల కేటాయింపులు ముఖ్యం కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నాకు ముఖ్యం’ యూపీఏ ప్రభుత్వంలో చేరిన కేసీఆర్‌ను ఏ శాఖ కావాలని అడిగినప్పుడు ఆయన నుంచి వచ్చిన సమాధానాన్ని ‘ది కొలిషన్ ఇయర్స్ 1996-2012’ ఆత్మకథలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ తపనకు, తండ్లాటకు ఇంతకు మించిన కొలమానం ఏముంటుంది? ఆయన జెండా, ఎజెండా తెలంగాణ. పిడికెడు మందిని వెంటేసుకుని జీవితకాల గమ్యాన్ని పుష్కర కాలంలోనే సాధించిన సంకల్ప వీరుడు. ప్రపంచ రాజకీయ చిత్రపటంలో ఎదగాల్సినంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఇవాళ ఆయన ఎత్తు తగ్గిస్తాం..ఆనవాళ్లు లేకుండా చేస్తాం.. కేసులు పెట్టి అంతు చూస్తాం..అంటే అయ్యే పనేనా? ఈ వికృతాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? ఆమోదిస్తారా?
పదేండ్ల అనంతరం బీఆర్ఎస్ పాలనను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారంటే..అర్థం కేసీఆర్‌ను తిరస్కరించినట్టు కాదు. తెలుగు రాజకీయాల్లో ఉన్న సంకేతాత్మక దౌర్భాగ్యం. నేతలు అడ్డగోలు హామీలతో ఆశ పెడితే..ప్రజలు నమ్మి ఎండమావుల వెంట పరుగెత్తటమే సంకేతాత్మక దౌర్భాగ్యం. ‘పింఛన్ ఇప్పుడు తీసుకుంటే రూ.2 వేలే.. అదే మేం అధికారంలోకి వచ్చినంక తీసుకుంటే రూ.4 వేలు’ అని ముసలోళ్లను ఆశ పెట్టిండు. ‘రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే రూ.10 వేలే..అదే మేం అధికారంలోకి వచ్చినంక తీసుకుంటే రూ.15 వేలు’ అని రైతులను మోసం చేసిండు.
‘మేం అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి కింద ఆడబిడ్డకు తులం బంగారం’ పోలుపొందులేని హామీలతో ఓటర్లను బోర్లేసిండ్రు. అట్లా కొలువు మీదికొచ్చిన దినపొద్దు నుంచి ఈ పొద్దు దాకా పరిపాలనను, రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదిలేసి కేసీఆర్, ఆయన కుటుంబం మీద ప్రయోగించని అస్త్రం లేదు. విసరని పాచిక లేదు. శోధించని ఫైల్ లేదు. పరిశోధించని కోణం లేదు. విచారించని అంశం లేదు. కరెంటు కమిషన్..కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీలు..ఫోన్ ట్యాపింగ్..ఈ కార్ రేసింగ్.. అట్లా ఎన్ని చేసినా ఎక్కడా కేసీఆర్ వెంట్రుకను కూడా పట్టలేకపోయిండ్రనేది నిర్వివాదం.
సీఎంగా కుర్చీ ఎక్కిన నాటి నుంచి నిలువెల్లా తెలంగాణ ద్వేషభావమే. వచ్చీ రావటంతోనే తెలంగాణ సాంస్కృతిక ప్రతీకల విధ్వంసానికి పూనుకున్నడు. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్చిండు. తెలంగాణ తల్లి విగ్రహం తీసేసిండు..సచివాలయంలో రాజీవ్‌గాంధీ బొమ్మ తెచ్చిపెట్టిండు. గద్దరన్న ప్రతిమను ఊరవతల నిలబెట్టి ..బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తీసుకొచ్చి రవీంద్రభారతిలో పొందిచ్చిండు. ఇప్పుడా ఆగడాలు అవధులు దాటి, సిట్ విచారణ పేరుతో కేసీఆర్ మీద పోలీసులను ప్రయోగించిండు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపితను హేళన చేసిండు. అదే నోరు ఇంకింత పెగిలి ఎన్టీఆర్‌ను ఎత్తుకున్నది. జాతీయ సొత్తు అని కీర్తించింది. భారతరత్న ప్రతిపాదన తెచ్చింది. చంద్రబాబుకు తెలంగాణలో జీవం పోసే బహురూపుల జిత్తులే ఈ ఎత్తులు.
ఒకే ఒక్క వ్యక్తిగా తొలి అడుగు వేసిన కేసీఆర్ శూన్యంలో నుంచి సునామీ సృష్టించారు. ఇక మన బతుకులు దుబాయి.. బొంబాయి.. బొగ్గుబాయి అన్నట్టున్న తెలంగాణ ప్రజల కోసం స్వయంగా ఒక పార్టీని స్థాపించి, మహోధృతమైన రూపంలో ఉద్యమాన్ని నడిపి అసా ధ్యం అనుకున్న తెలంగాణ సుసాధ్యం చేసి పట్టుకొచ్చారు. ఇదే ఇంకో ప్రాం తంలో అయితే రాజకీయాలకు అతీతంగా పూజలు అందుకునే వారు.
తెలంగాణ సున్నితత్వం అంటని, ఈ గాలి పొడ గిట్టని వ్యక్తుల చేతుల్లో రా ష్ట్రం పడ్డది. వీరతిలకం దిద్దాల్సిన ఈ నేల మీదనే ‘సారు’కు తీరని అవమానాలు. తెలంగాణ పసిబిడ్డగా ఉన్నప్పుడే గొంతు నులిమి చంపాలని చూసి దొరికిన హంతకులకు సత్కారాలు. ఇందుకా తెలంగాణ కోరి కొట్లాడి తెచ్చుకున్నది? సమైక్యవాద భావజాలాన్ని మళ్లీ ఎగదోసి దొంగలకు సద్ది కట్టే కుట్రలను తెలంగాణ సమాజం సమర్థిస్తుందా?
రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే విచారణ కమిషన్ ఎవరి మీద వేయాలి? నైని టెండర్లలో అవినీతి జరిగిందని స్వయంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఈ కుంభకోణంలో సూత్రధారుల మీద విచారణ కమిషన్ వేయాలి. సిమెంట్ ఇండస్ట్రియలిస్టు కణత మీద గురిపెట్టిన మంత్రి కొండా సురేఖ వోఎస్డీ గన్ను మీద విచారణ కమిషన్ వేయాలి. రైతులకు ఒక్క యూరి యా బస్తా కూడా ఇవ్వలేని సర్కారు దయనీయం మీద, రైతన్నల వెన్ను మీద విరుచుకుపడుతున్న పోలీసు లాఠీల దాష్ఠీకం మీద విచారణ జరగాలి.
తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన కేసీఆర్ పాలన చరిత్రాత్మకం. ఉద్యమ ఆకాంక్షలు, ఆదర్శాలకు తగినట్టుగా ఒక్కొక్క రంగాన్ని రిపేర్ చేశారు. కేసీఆర్ కొలువు కూటాల మీదికి రాగానే విద్యు త్తు సమస్యను నిలువరించారు. సాగుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో తెలంగాణను సాగుబడిలోకి తెచ్చారు. దేశంలో ఎవరూ ఊ హించని విధంగా కోటి ఎకరాల మాగాణిగా మార్చారు. సంక్షేమ పథకాలను స్ట్రీమ్ లైన్ చేశారు. రైతు బీమా, పేదింటి ఆడపిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గర్భిణుల రక్షణకు అమ్మఒడి, తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ, దవాఖానల ఆధునికీకరణ, కంటివెలుగు, వయోపరిమితిని 57 ఏండ్లకు కుదించి, వికలాంగులకు రూ.3, 016, ఇతరులకు రూ.2,016 పింఛన్ పథకాలతో పేదింట్లో దీపం పెట్టారు.
ఒక నిర్ణయం తీసుకునే ముందే దాని గురించి లోతుగా ఆలోచించడం కేసీఆర్ స్వభావం. తులనాత్మక మదింపు లేనిదే ఏ పనీ ఆయన చేయరు. పకడ్బందీగా వ్యూహాలను రచించటం..వాటిని మూల్యాంకనం చేయటం.. వాంచిత ఫలితాలను నిష్కర్షగా అమలు చేయటం ఆయన నైజం. దూకుడుగా వెళ్తున్నట్లు కనిపించినా..ప్రతి అడుగు శాస్త్రీయంగానే ముందుకు వేస్తారు. ఇక్కడో సందర్భం గుర్తు చేయాలి. గోదావరి జలాల మీద 25 ఏండ్ల నుండి మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాలు ఉండేవి. 2005లో చంద్రబాబు నాయుడు ఈ వివాదాలను మరింత జఠిలం చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులను వెంటబెట్టుకొని బాబ్లీ ప్రాజెక్టు వద్ద రైతులతో గొడవ పడుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రతి సమస్యను వివాదం చేయాలి. ఆ వివాదాలతోని కాలం గడపాలి. ఇదే చంద్రబాబుకి తెలిసిన రాజకీయం.
స్వరాజ్యం సిద్ధించి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మరుసటి ఏడాది అంటే 2015లో ‘జల వివాదాలపై కలిసి మాట్లాడుకుందాం రండి’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేం ద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే గోదావరి వివాదం పోయి, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడ్డది. ఈ దృగ్విషయాన్ని స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల తెలంగాణ గడ్డ మీద నిలబడి చెప్పారు.
ఈనెల 7న కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన..‘కేసీఆర్ చొరవ వల్లే తెలంగాణ-మహారాష్ట్ర జల వివాదం పరిష్కారం అయ్యిందని’ గుర్తు చేసుకున్నారు. ప్రపంచపటం మీద తెలంగాణను రోల్‌మోడల్‌గా నిలబెట్టిన దర్శకుడు. తెలంగాణ రాజకీయ స్వరూపాన్ని వందేండ్లకు సెట్ చేసి పెట్టిన దార్శనికుడు. ఆయన ఆనవాళ్లు లేకుండా చేస్తామని కొందరు గొప్పలకు పోతున్నారు. నిరాకారుని స్వరూపం ఏమిటని అడుగుతున్నారు.
ఈ నేల నవనాడుల్లో పోటెత్తే ఉత్తేజ శబ్దం కేసీఆర్. తెలంగాణ నేల నవనాడుల్లో ప్రవహించే చైతన్య రూపమే కేసీఆర్. దునికే మత్తడి.. పారే వాగు.. నిండిన చెరువు.. పిట్ట వాలిన చెట్టు.. వెలిగే కరెంటు బుగ్గ.. ఆకాశం అంత ఎత్తుకు నిలబడిన అంబేడ్కర్ విగ్రహం, ఆ పక్కనే సచివాలయం.. అమరవీరుల స్థూపం.. కోటి ఎకరాల మాగాణం అన్నీ ఆయన ఆనవాళ్లే.
వీటిలో వేటిని చెరపగలరో చెప్పాలని పాలకులను తెలంగాణ సమాజం అడుగుతున్నది. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలతో..
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు