గతంలో తాగునీటి అగచాట్లు అన్నీఇన్నీ కావు.. గుక్కెడు నీటి కోసం జనం అరిగోస పడ్డారు. నల్లా ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎంతసేపు వస్తుందో తెలియదు.. అది కూడా రెండు, మూడు రోజులకొకసారి వస్తే మహిళలు ఎగబడేవారు. నీటిని పట్టుకునేందుకు చిన్నపాటి యుద్ధమే చేసేవారు. అంతేకాదు, నల్లా వస్తుందంటే ఆ రోజు పనిమానేసి ఇంటి వద్ద ఉండాల్సిన పరిస్థితి. ఇక ఎండాకాలం వచ్చిందంటే నీటిఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడేవారు.. కానిప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ ఆడబిడ్డల క‘న్నీటి’ కష్టాలు తీర్చేందుకు భగీరథుడయ్యాడు. ‘పాని’పట్టు యుద్ధాలకు చరమగీతం పాడేందుకు ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి శుద్ధజలం అందిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో రానున్న 15 ఏండ్ల వరకు నీటి సరఫరాకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కొత్తగా 18 మంచినీటి ట్యాంక్‌లు నిర్మించారు. మరో 30 ఏళ్ల భవిష్యత్తును ఊహించి పైప్లైన్లు నిర్మించారు. కాగా, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిసారించి పైప్లైన్లు, మంచినీటి ట్యాంక్‌లను పూర్తి చేయించారు.
ఖమ్మం, ఏప్రిల్ 4: ఉమ్మడి పాలనలో రెండు మూడు రోజులకోసారి నీటి సరఫరా.. సరఫరా కూడా ఎంతసేపు ఉంటుందో తెలియదు.. ఇక ఎండాకాలం వచ్చిందంటే తీవ్రమైన నీటిఎద్దడి.. రాక రాక నీరు విడుదలైతే వీధిలోని నల్లాల వద్ద మహిళల ‘పాని’పట్టు యుద్ధాలు జరిగేవి. నాడు నీటి శుద్ధి అంతంతమాత్రంగా ఉండేది. ఆ నీటిని తాగి ప్రజలు డయేరియా వంటి జబ్బుల పాలయ్యేవారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘మిషన్ భగీరథ’ పథకాన్ని అమలు చేస్తున్నారు. నగరాలు, పట్టణాల నుంచి ఇంటింటికీ శుద్ధజలం అందించాలని కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం నగరవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు నగరపాలక సంస్థ ద్వారా రూ.230 కోట్ల నిధులు విడుదల చేశారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి పైప్లైన్లు, మంచినీటి ట్యాంక్‌లను పూర్తి చేయించారు.
రానున్న 15 ఏండ్లలో నీటి సరఫరాకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కొత్తగా 18 మంచినీటి ట్యాంక్‌లు నిర్మించారు. మరో 30 ఏళ్ల భవిష్యత్తును ఊహించి పైప్లైన్లు నిర్మించారు. నగరవ్యాప్తంగా 80 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నగరవాసులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా నీటి కనెక్షన్ ఇస్తున్నది. కేఎంసీకి నల్లా డిపాజిట్లు, రోడ్డు కటింగ్, మీటర్, బాల్వాల్, సపోర్ట్ రాడ్‌కు చార్జీలన్నింటినీ ప్రభుత్వమే భరించింది. నగరంలో పాత కనెక్షన్లు 35 వేలు ఉండగా కొత్తగా ప్రభుత్వం మరో 45 వేల నల్లా కనెక్షన్లు ఇచ్చింది.
నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు ప్రతి నల్లాకు మీటర్లు బిగిస్తున్నారు. ప్రతి ఇంటికీ 150 లీటర్ల నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పద్ధతిలో ఎత్తైన ప్రాంతంలోని ఇండ్లకైనా, లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లకైనా సమానంగా నీరు అందుతున్నది. ఎక్కువ, తక్కువ అనే మాటలకు తావే లేదు. అందరికీ సమానంగా తాగునీరు అందుతుంది. పైప్లైన్స్కు మోటర్లు బిగించి నీటి చోరీకి పాల్పడే వారికి అడ్డుకట్టపడుతుంది.
ప్రస్తుతం ఖమ్మం నగరానికి జీళ్లచెర్వులోని ఫిల్టర్ బెడ్ నుంచి శుద్ధజలం సరఫరా అవుతున్నది. మిషన్ భగీరథ అధికారులు పాలేరు జలాశయం నుంచి పైప్‌లైన్ ద్వారా ‘రా’వాటర్ తరలిస్తున్నారు. అక్కడి ఫిల్టర్బె డ్లో నీటిని శుద్ధి చేసి నగరానికి తరలిస్తున్నారు. ఎన్నెస్పీ ప్రాంతంలోని రస్తోగినగర్ నుంచి 60 డివిజన్లకు తాగునీరు సరఫరా అవుతున్నది. సరఫరాకు అధికారులు 38 కిలోమీటర్ల మేర ఫీడర్ గ్రావిటీ లైన్స్, 485 కి.మీ పైప్‌లైన్స్ ఏర్పాటు చేశారు.